ఏపీపై ఉన్న సానుభూతి తెలంగాణపై లేదు: మోడీ ప్రభుత్వంపై కోదండరాం
హైదరాబాద్: దాదాపు అరవై ఏళ్ల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకే అన్యాయం జరిగిందనే భావన కేంద్రంలో ఉందని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ఆచార్య కోదండరాం గురువారం అన్నారు.
నీల్‌కమల్ ఆధ్వర్యంలో డాక్టర్ కెబి సంధ్య విప్లవ్ రచించిన ‘తెలంగాణ ది ఎపిక్ సాగా ఆఫ్ సాయిల్ అండ్ సాల్వేషన్' పుస్తకావిష్కరణ సభను గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. దీనిని కోదండరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ ఆవేదన అర్థమైతే తప్ప ఢిల్లీ పెద్దలకు మన బాధ ఏమిటో అర్థం కాదని, అందుకు ఇలాంటి రచనలు ఆంగ్లం, హిందీ భాషల్లో మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొండ విశ్వేశ్వర రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు.

అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి: మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా ఢిల్లీ తీసుకువెళ్లాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
పార్శీగుట్టలోని కార్యాలయంలో గురువారం ఎంఎస్ఎఫ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సంయుక్త సమావేశం నిర్వహించారు.
విజయ్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మార్పీఎస్ సహకారం తీసుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన నోటివెంట వర్గీకరణ అంశం రావటం లేదన్నారు. వర్గీకరణపై ఆయన ప్రకటన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications