ఆంధ్ర టీచర్లను పంపించండి: కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వర్తిస్తూ, తమ సొంత రాష్ర్టానికి వెళ్తామంటున్న టీచర్లను వెంటనే ఆంధ్రకు పంపాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ డీఎస్సీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రాకు చెందిన ఏడు వేల మంది టీచర్లను బదిలీ చేస్తే.. తెలంగాణ బిడ్డలతో ఆ ఖాళీలను భర్తీ చేయవచ్చని సూచించారు.
డీఎస్సీ అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఉన్నత పాఠశాలలన్నింటినీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ నియంత పాలనతో నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తున్నారని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పుడు మామ అల్లుళ్లు.. తండ్రి కొడుకుల పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చని బాప్ ఏక్ నెంబర్ చోర్.. బేటా దస్ నంబర్ చోర్ అని వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. పది నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్ ఇప్పటి వరకు ఉస్మానియా వర్సిటీకి ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు.
ఆంధ్ర సెటిలర్స్ కాలుకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానంటున్న కేసీఆర్ ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలు, ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థుల కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని తప్పు పట్టారు.
నాణ్యత కొరవడిన పాఠశాలలను మూసివేస్తామంటున్న కేసీఆర్ తన ప్రభుత్వంలోని అసమర్థ మంత్రులు, ఎమ్మెల్మేలను కూడా తొలగిస్తారా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం మాట్లాడుతూ - కోటి ఆశలతో బతుకులు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు గద్దెనెక్కిస్తే సీఎం కేసీఆర్.. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా రని విమర్శించారు.
ఇంటికో ఉద్యోగం అంటూ బంగారు తెలంగాణ సినిమా చూపించి ప్రజలను రక్తికట్టించిన కిలాడీ.. కేసీఆర్ అని మండలి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పొంగులేటి సుధాకర్ ఎద్దేవా చేశారు. నాలుగు లక్షలమంది అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వెంటనే డీఎస్సీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications