పిలిచి అవమానమా?: ఉత్తమ్‌తో పొంగులేటి వాగ్వాదం, కోమటిరెడ్డి బహిష్కరణ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి నిరసన గళాలు వినిపించాయి. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైన టీసీఎల్పీ భేటీని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బహిష్కరించారు.
సమావేశానికి పిలిచి అవమానించారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకొచ్చేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన టీ పీసీసీ పెద్దలు తేరుకునేలోగానే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశాన్ని బహిష్కరించారు.

ఆరు నెలలుగా నల్గొండ డీసీసీకి అధ్యక్షుడినే నియమించలేదని నిరసన వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి వాకౌట్ చేశారు. పొంగులేటి వాకౌట్ సందర్భంగా ఆయన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వాగ్వాదానికి కూడా దిగారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచామని ఉత్తమ్ చెప్పగా.. ఆహ్వానం అందితేనే తాను భేటీకి హాజరయ్యానని పొంగులేటి వాదించారు. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో అక్కడ కొంత కలకలం రేగింది. సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు జానా రెడ్డి, తదితర నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications