నా నాలుకపై మచ్చ.. 2019లో తెరాసకు 5 సీట్లే, కేసీఆర్ గెలుపు కష్టమే, జానాకు చెప్పా: కోమటిరెడ్డి
2019 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి 5 సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం నాడు అన్నారు.
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి 5 సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం నాడు అన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులతో పాటు మరో ముగ్గురే గెలుస్తారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గెలుపు కూడా కష్టమేనని చెప్పారు. తన నాలుక మీద మచ్చ ఉందని, తాను చెప్పింది కచ్చితంగా నిజమవుతుందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే వాళ్ల పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు.
హరీష్ రావు తెలంగాణ పోరాట యోధుడు అని కితాబిచ్చారు. 2011లో తనతో పాటు మిగతా మంత్రులు రాజీనామా చేసి ఉంటే అప్పుడే తెలంగాణ వచ్చేదని చెప్పారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకునేదని చెప్పారు. అప్పుడు తెరాస అడ్రస్ లేకుండా పోయేదన్నారు.

తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం జరగడం వల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని చెప్పారు. అప్పట్లో ఈ విషయాన్ని తమ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. త్వరలోనే రాష్ట్రమంతా మోటార్ సైకిల్ పైన యాత్ర చేస్తానని, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతానన్నారు.
కోమటిరెడ్డి వర్సెస్ భాస్కర రావు
వచ్చే ఎన్నికల్లో తెరాస కేవలం ఐదు సీట్లే గెలుస్తుందన్న కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర రావు స్పందించారు. కోమటిరెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. కోమటిరెడ్డి రాజీనామా చేస్తే నేనేంటో చూపిస్తానని సవాల్ చేశారు.
కోమటిరెడ్డి కూడా ధీటుగా స్పందించారు. భాస్కర రావు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని ప్రతి సవాల్ విసిరారు. మిర్యాల గూడ నుంచి భాస్కర రావు గెలిస్తే తాను తెరాస కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications