అదృష్టం కొద్దీ దక్కిన అధికారం, చరిత్ర క్షమించదు- కోమటిరెడ్డి కౌంటర్..!!
తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల పైన సీఎం రేవంత్ సైతం ఘాటుగా స్పందించారు. పరోక్షంగా తమ పార్టీలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో వారిని ఎర్రగడ్డ ఆస్పత్రికి పార్టీ కార్యకర్తలే తీసుకెళ్తారంటూ వ్యాఖ్యానించారు. దీని పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది.
మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా సీఎం రేవంత్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని ఫైర్ అయ్యారు. కాలం కలిసి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర కనుసన్నల్లోనే రేవంత్ పాలన సాగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్ నగర్ మాత్రమేనా అని ప్రశ్నించారు. తన నియోజక వర్గానికి నిధులు ఇవ్వకుంటే కురుక్షేత్రం తప్పదని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ ఎందుకని.. ఉన్న సిటీకే గతి లేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. నువ్వేం ముఖ్యమంత్రివి.. నీదేం భాష.. పండబెట్టి తొక్కుతా అనటం ఏంటని రాజగోపాల్ రెడ్డి నిలదీసారు. పదవుల కోసం తాను ఎవరి ఇంటి చుట్టూ తిరగనని... తనకు పదవి రావాల్సి ఉంటే అదే వస్తుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ లో పెరుగుతున్న ధిక్కార స్వరం
ఈ వ్యాఖ్యల పైన సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. సిద్దిపేట సభలో తమ పార్టీలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అంటూ పరోక్షంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో రేవంత్ మాట్లాడిన మాటల పైన రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసారు. అందులో.." ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరా లను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను.." అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీంతో.. కాంగ్రెస్ లో ఈ వ్యవహారం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
