వారు తప్పుకున్నారు, కొండా మురళీ ఏకగ్రీవం: విపక్షాలపై కెటిఆర్ ఆగ్రహం
వరంగల్: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కొండా మురళీ వరంగల్ నుంచి టిఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
ఆయనతో పాటు అయిదురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, గురువారం నాడు స్వతంత్ర అభ్యర్థులు అయిదుగురు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో, కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కొండా మురళి ఎమ్మెల్యే కొండా సురేఖ భర్త అని తెలిసిందే.

డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్
తమ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ది కార్యక్రమాలను చూడలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. బాగ్ లింగంపల్లిలోని లంబాడి బస్తీలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకులు హైదరాబాద్‌ను అధ్వాన స్థితికి తెచ్చారన్నారు. రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.
టిఆర్ఎస్ పేదవాళ్ల కన్నీళ్ల నుంచి వచ్చిన ప్రభుత్వం అన్నారు. సంక్షేమ పథకాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడటం సహజమని చెప్పారు. అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరు ముందుకు రావాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత గ్రేటర్ హైదరాబాదులోని వాటర్, కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి మంచి నీరు ఇస్తామన్నారు. దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కెసిఆర్‌దే అన్నారు.
ఆరు నెలల్లోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications