కొండా సురేఖ సంచలన నిర్ణయం - రాజీనామా..!!
తెలంగాణ కాంగ్రెస్ నేత కొండా సురేఖ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టీపీసీసీ కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఆ కమిటీల్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొండా సురేఖను నియమించారు. కానీ, కొండా సురేఖ ఆ పదవిని తిరస్కరించారు. తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేసారు. కమిటీల నియామకంలో సీనియార్టీని పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. తన కంటే జూనియర్లకు ప్రాధాన్యత దక్కిందని చెప్పుకొచ్చారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో ఉన్నా గుర్తింపు లేదన్నారు. ఇప్పుడు కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనంగా మారుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాట పై ఏఐసీసీ నిర్ణయం తీసుకొని 24 గంటలు పూర్తి కాకముందే అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. అటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పార్టీ కమిటీల్లో అవకాశం ఇవ్వలేదు. దీని పైన ఆయన అసంతృప్తితో ఉన్నా.. కామెంట్స్ చేసేందుకు వ్యతిరేకించారు. అయితే, కొండా సురేఖ తనకు టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం ఇవ్వకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో అవకాశం ఇవ్వక పోవటం పైన అసంతృప్తితో ఉన్న కొండా సురేఖ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేసారు. తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నామన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి మంత్రిగా పని చేసిన సీనియర్ గా ఉన్న తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని చెప్పుకొచ్చారు.

రేవంత్ కు తమ మద్దతు ఉంటుందని కొండా సురేఖ స్పష్టం చేసారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. వారికి ప్రాధాన్యత ఇవ్వటం కోసం కాంగ్రెస్ నేతలను తక్కువ చేయటం బాధ కలిగిస్తుందన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ లో సరి చేసుకోవాల్సి ఉందన్నారు. రేవంత్ ను వ్యతిరేకించే వారు ఎవరైనా ఉంటే..వారి వలన నష్టం ఉండదన్నారు. సముద్రం లాంటి కాంగ్రెస్ లో ఒకరిద్దరు వెళ్లిపోవటం వలన పెద్దగా ప్రభావం ఉండదని విశ్లేషించారు. తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో అవకాశం ఇచ్చినా లేకున్నా..తాను పట్టించుకోనని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్, పరకాల నియోజకవర్గాల్లో కార్యకర్తలతో తాను కలిసే ఉంటానని కొండా సురేఖ వెల్లడించారు. తనకు పదవుల కంటే ఆత్మాభిమానం ముఖ్యమని కొండా సురేఖ లేఖలో తేల్చి చెప్పారు. ఇప్పుడు కొండా సురేఖ రాసిన లేఖ టీపీసీసీలో చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications