చంద్రబాబును కూడా ఉరికిచ్చినం: మాటల దాడి పెంచిన కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కెటి రామారావు విమర్శల దాడి పెంచారు.
రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లిలో ఆయన బుధవారంనాడు రోడ్ షో నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌నే కాదు, వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినంమని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు. 60 ఏళ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతుందా అని అడిగారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామని ఆయన చెప్పారు.

కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, లక్షా 80 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఆటోలకు రూ. 77 కోట్ల రవాణా పన్ను మాఫీ చేశామని, గ్రేటర్‌లో నల్లా, విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ. 51 వేలు అందిస్తున్నామని చెప్పారు.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, ఇక సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నామని, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications