కేటీఆర్ చెప్పిందొకటి .. చేస్తోందొకటి; హాట్ డిబేట్ !!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోగా, కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు చేపట్టింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు పై స్పందించిన బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తీర్పును తాము శిరసావహిస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆరునెలల సమయం ఇస్తామని, ఆ తర్వాత ప్రజా సమస్యలపైన మాట్లాడుతామని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణ ప్రజలు కూడా కేటీఆర్ మంచి విజ్ఞత కలిగిన నిర్ణయం తీసుకున్నారని భావించారు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా సర్దుబాటు చేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే కేటీఆర్ నిర్ణయం అందరికీ నచ్చిందన్నారు.

అయితే కేటీఆర్ ఈ మాట చెప్పి రెండు రోజులైనా కాకముందే, అమలు సాధ్యం కాని ఆరు హామీలను ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి, హామీలను అమలు చేస్తామని చెబుతున్నారు. వాళ్ళు ఎలా చేస్తారో మేం కూడా చూస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల దాడి మొదలుపెట్టారు.
అసెంబ్లీలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. ఆరు నెలల వరకు విమర్శల జోలికి పోమని చెప్పి, ఇప్పుడు ఎలా విమర్శలు చేస్తున్నారని ప్రజలలో చర్చ జరుగుతుంది. ఇక దీనికి బీఆర్ఎస్ నేతలు చాలా డిప్లమాటిక్ గా సమాధానం చెబుతున్నారు.
కొత్తగా నెలకొన్న ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాము.. వాళ్లు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి అని చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పుడు మేము నిలదీస్తున్నది కేవలం వాళ్లు తేదీలతో సహా ప్రకటించి నెరవేరుస్తామని ప్రకటించిన వాటిపైనే అంటూ బీఆర్ఎస్ నేతలు సమాధానం చెబుతున్నారు.
ఏది ఏమైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలి అనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేటీఆర్ వ్యవహార శైలిపై ఆసక్తిగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications