ఇక సిద్దం కండి, పార్టీ నేతలకు కేటీఆర్ కీలక పిలుపు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికలు పూర్తి కావటంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ భేటీలో వీటి పైన నిర్ణయం తీసుకోనున్నారు. అటు చాలా రోజుల తరువాత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కాగా.. ఈ సమయంలోనే మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నేతలు.. కేడర్ కు కీలక పిలుపునిచ్చారు.
తాండూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. షాపుల యూరియా ఇవ్వనోడు.. యాప్‌ల యూరియా ఇస్తాడంట అని ఎద్దేవా చేశారు. 2014 నాటికి తెలంగాణ అప్పు రూ.72 వేల కోట్లుగా ఉందని తెలిపారు. 2023 నాటికి తెలంగాణ అప్పు రూ.మూడున్నర లక్షల కోట్లు అయ్యిందని అన్నారు. అంటే.. బీఆర్‌ఎస్ హయాంలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేశారని వివరించారు. అంటే కేసీఆర్ చేసిన మొత్తం అప్పు రూ.2.80 లక్షల కోట్లే అని తెలిపారు. అదే రేవంత్ రెడ్డి అప్పు తెచ్చి ఏంచేసారో చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోట అభివృద్ధి అనేది ఉండదని అన్నారు. కేసీఆర్ హయాంలో డంపింగ్ యార్డ్‌లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల 21 జాతీయ పంచాయతీ అవార్డులను తెలంగాణ సాధించిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు గెలవడం సులభం.. కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే కష్టమని కేటీఆర్ తెలిపారు. ఈ రెండేళ్లు మనకు కష్టంగా ఉంటుందని కొత్తగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లతో వ్యాఖ్యానించారు.
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ తెలిపారు. తాండూరులో ఉండే 36 వార్డుల్లో ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications