పక్క రాష్ట్ర సిఎం చేస్తున్నదేంటి: టిడిపిపై కెటిఆర్ ఫైర్
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల విషయంలో పక్కరాష్ట్ర సిఎం చంద్రబాబునాయడు చేస్తున్నదేంటని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కెటి రామారావు తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులను ప్రశ్నించారు. శనివారం శాసనసభలో టిడిపి నేతల తీరుపై కెటిఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... దొంగే దొంగ అన్నట్లుందని అన్నారు.
టిడిపి నేతలు ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించారని, పక్కరాష్ట్ర సిఎం చెప్పినట్టు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ‘పక్కరాష్ట్ర సిఎం చేస్తున్నదేంటి? ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టిడిపిలో చేర్చుకోవటం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు రెండు నాల్కల సిద్ధాంతం మొదలుపెట్టారని ఆరోపించారు. పార్టీలు మారిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
‘టిడిపి అధికారంలోకి వస్తే హుస్సేన్‌సాగర్‌లో అమరవీరుల స్థూపం కడ్తరంటా? హంతకులే సంతాపం తెలపడం విడ్డూరంగా ఉంది' కెటిఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతూ.. 'ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదా? టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. వైయస్ ముందు ఒక్క మాట మాట్లాడే ధైర్యంలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటు' అని ధ్వజమెత్తారు.

తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామంటే అందరినీ కలుపుకుపోతామని కెటిఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధే తమ లక్ష్యమని, విపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. కుసంస్కారంగా వ్యవహరిస్తే సరైన బుద్ధి చెప్తామని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.
టిడిపికో నీతి.. మరోపార్టీకో నీతా: జూపల్లి
ఎంతసేపూ చంద్రబాబు జెండానే మోయాలనుకుంటున్నరని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలుగుదేశం పార్టీ సభ్యులపై మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా టిడిపి నేతలు ప్రవర్తించిన తీరుపై ఆయన స్పందిస్తూ.. తెలంగాణ బిడ్డలు చనిపోయినప్పుడు టిడిపి సభ్యులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధిని టిడిపి సభ్యులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, జూపూడి, చైతన్య రాజులను చంద్రబాబు టిడిపిలోకి చేర్చుకోలేదా? టిడిపికి ఒక నీతి, మరో పార్టీకి ఇంకో నీతా అంటూ టిడిపి నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications