నమో అంటే..: కేటీఆర్ చెప్పిన కొత్త అర్థం: అది తెలుసుకుంటే మంచిది
హైదరాబాద్: మహబూబ్ నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తిప్పి కొట్టారు. మోదీ చేసిన విమర్శల్లో అర్థం లేదని, అవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి తెలియదంటూ ధ్వజమెత్తారు.
ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘ సమాచారాన్ని పోస్ట్ చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అనే విషయం తెలంగాణ ప్రజలకు బాగాతెలుసునని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో అధికార మార్పును ప్రజలు కోరుకుంటోన్నారని ఎదురుదాడి చేశారు.

బీఆర్ఎస్ కారు స్టీరింగ్.. కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, బీజేపీ స్టీరింగ్..మాత్రం అదాని చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ సెటైర్లు సంధించారు కేటీఆర్. కిసాన్ సమ్మాన్ కింద కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం నామమాత్రమేనని, తాము 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని అన్నారు.
రైతుల రుణమాఫీ జరగనే లేదంటూ మోదీ మాట్లాడటాన్ని ఓ మిలియన్ డాలర్ జోక్‌గా అభివర్ణించారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం ఒక్క తెలంగాణలోనే ఆవిష్కృతమైందని గుర్తు చేశారాయన. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు.
కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దుచేసిన ..నై కిసాన్ సర్కారు మోదీదేనంటూ చురకలు అంటించారు. కర్షకుల రక్తాన్ని కళ్లజూసిన రైతుహంతక రాజ్యం మీదంటూ మండిపడ్డారు. పదేళ్ల పాటు విభజన హామీలను పాతరేసి, ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, ఇప్పుడు ఓట్ల వేటలో మాట్లాడితే నమ్మేదెవరంటూ మోదీని ప్రశ్నించారు.
ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం మోదీ అవివేకానికి నిదర్శనం అంటూ విమర్శించారు కేటీఆర్. తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతోందని, తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని చెప్పారు.












Click it and Unblock the Notifications