దేశంలోనే తెలంగాణ టాప్: కేటీఆర్‌ను అభినందించిన శాంతను నారాయణ్, అవార్డు

హైదరాబాద్: నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం అద్భుతాలను సృష్టిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల స్థాపనకు గమ్యస్థానంగా రూపుదిద్దుకుందని ఆయన చెప్పారు. సోమవారం హెచ్ఐసీసీలో ది ఇండస్ ఎంట్రప్రిన్యూర్స్(టై) గ్లోబల్ సమ్మిట్-2022ను కేటీఆర్ ప్రారంభించారు.

దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్న కేటీఆర్

దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్న కేటీఆర్

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ రాకెట్‌ను తొలిసారి అంతరిక్షంలోకి పంపిన స్టార్టప్ 'స్కైరూట్' హైదరాబాద్ కు చెందినది కావడం తమకు గర్వకారణమన్నారు. 50 విభాగాల్లో 6500 స్టార్టప్‌ల నిర్వహణ ద్వారా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులకు సురక్షిత, లాభదాయక గమ్యస్థానంగా ఉన్న తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఎనిమిదిన్నర ఏళ్లల్లో తెలంగాణ ఎన్నో సంచలన విజయాలను నమోదు చేసిందన్నారు కేటీఆర్. తలసరి ఆదాయంలో 130 శాతం, జీఆర్‌డీపీలో 130 శాతం పెరుగుదల సాధించిందని, ఐటీ ఎగుమతులు 250 శాతం, వ్యవసాయ యాక్టివిటీ 190 శాతం పెరిగాయని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో పచ్చదనం 24 శాతం పెరిగిందని తెలిపారు. 'దేశంలోభౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నప్పటికీ.. దేశ స్థూలజాతీయోత్పత్తికి అత్యధికంగా దోహదపడుతున్న 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ రాణిస్తుందని కేటీఆర్‌ వెల్లడించారు.

లైఫ్‌సైన్సెస్‌తో పాటు ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామి

కరోనా సమయంలో ప్రపంచంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతు హైదరాబాద్‌లోనే తయారయ్యాయని కేటీఆర్‌ చెప్పారు. తొమ్మిది బిలియన్‌ డోసులు ఇక్కడినుంచే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యాయి. వచ్చే ఏడాది ఇవి 14 బిలియన్లకు పెరుగనున్నాయని, ఇది గ్లోబల్‌ ప్రొడక్షన్‌లో 50శాతంగా ఉండనున్నాయని వివరించారు. లైఫ్‌సైన్సెస్‌తో పాటు ఐటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. యాపిల్‌, గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఊబర్‌, మైక్రాన్‌, క్వాల్‌కామ్‌.. ప్రపంచంలోని అతిపెద్ద దిగ్గజ సంస్థలు తమ రెండవ అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పాయని కేటీఆర్‌ తెలిపారు.

ప్రపంచమంతటికీ విస్తరించడమే తమ లక్ష్యమన్న కేటీఆర్

తెలంగాణ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచమంతటికీ విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్వవాదాలు చెబుతున్నానని కేటీఆర్ తెలిపారు. హెచ్ఐసీసీలో ప్రారంభమైన టై గోబల్ సమ్మిట్ మూడు రోజులపాటు జరగనుంది. ఏడోసారి జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్, గ్రీన్‌కో గ్రూపు ఎండీ, సీఈవో అనిల్ కుమార్ తోపాటు 2500 మంది ప్రతినిధులు, 550కిపైగా టై చార్టర్ సభ్యులు హాజరయ్యారు. వీరితోపాటు 17 దేశాలకు చెందిన 150 అంతర్జాతీయ స్పీకర్లు, 200కిపైగా పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను అభినందించిన శంతను నారాయణ్

అడోబ్‌ సిస్టమ్స్‌ చైర్మన్‌, సీఈవో శంతను నారాయణ్‌ మాట్లాడుతూ.. సొంత నగరానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తాను హైదరాబాద్‌లోని పెరిగానని, ఇక్కడే చదువుకొన్నానని తెలిపారు. ఇక్కడి వారితో 'మనవాడు' అని అనిపించుకోవటం ఇంకా గొప్పగా ఉందని తెలిపారు. సంపద సృష్టిలో తెలంగాణ ఎంతో పురోగతి సాధిస్తుందని కొనియాడారు. మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో పారిశ్రామిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించిందని ప్రశంసించారు. స్టార్టప్‌ల అభివృద్ధిలో టీ-హబ్‌ విశేషంగా కృషిచేస్తున్నదని గుర్తుచేశారు. టెక్నాలజీ, మెడిసిన్‌, విద్య తదితర రంగాల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విశేష అవకాశాలున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం అందించడంలో కృషి చేస్తున్నందుకు 'టై'ని శంతను ప్రశంసించారు.

శంతను నారాయణ్‌కు సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

కాగా, సోమవారం జరిగిన టై గ్లోబల్‌ సమిట్‌లో అడోబ్‌ చైర్మన్‌, సీఈవో శంతను నారాయణ్‌కు సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మంత్రి కేటీఆర్‌ అందజేశారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ సురేశ్‌ రాజు, వైస్‌ చైర్మన్‌ మురళి బుక్కపట్నం తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+