కౌంట్ డౌన్ ఆరంభం, గుణపాఠాలుంటాయి - కేటీఆర్..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ చేసారు. 1.85శాతం ఓట్లతో తాము ఓడిపోయామన్నారు. అందులో ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో పోయాయని వివవరించారు. కాబట్టి ఇది ఘోర అపజయం కాదని,ఇది కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రతి గెలుపులో పాఠాలుంటాయని.. ఓటమిలో గుణపాఠాలుంటాయని కీలక వ్యాఖ్యలు చేసారు. పొరపాట్లు జరిగినాయని అంగీకరించిన కేటీఆర్.. సవరించుకొని ముందుకెళ్తామని చెప్పారు.
స్వేదపత్రం విడుదల : మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనపై 'స్వేదపత్రం' పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దేశంలో ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చాం... కానీ, ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికమని మేం ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా..చెప్పుకోలేకపోయామన్నారు. నిజం గడప దాటేలోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందనే సామెత తమ విషయంలో జరిగిందన్నారు. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయాం.. యూట్యూబ్‌లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయామని కేటీఆర్ వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ వివరించారు.

నిరాశ కలగలేదు : ఫలితాలు తమను నిరాశ పర్చలేదని కేటీఆర్ చెప్పారు. ప్రజలు తమకు రెండు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. అధికారం వాళ్ల చేతుల్లోనే ఉందని.. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా..లేక కక్ష్య సాధింపు కోసం వినియోగిస్తారా.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తామన్నారు. ఏరకంగా చేసిన మాకు అభ్యంతరం లేదని కేటీఆర్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. వంద రోజు కౌంట్ డౌన్ ప్రారంభమైందనిగుర్తు చేసారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మ్యానిఫెస్టోలో పెట్టి.. మొన్న ఉప ముఖ్యమంత్రి మేం అనలేదనే మాట అన్నారు. ఇట్ల ఎన్నో అంశాలున్నాయ్.. ఆరు గ్యారెంటీలు కాదు.. 142 హామీలున్నాయి. వాటిని లెక్కదీశాం. మా పార్టీ తరఫున షాడో టీమ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.

సరిదిద్దుకుంటాం : ప్రజల పక్షాన నిలబడతామని కేటీఆర్ చెప్పారు. దీపస్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వం.. పడిపోనివ్వమని చెప్పుకొచ్చారు. తామేసభలో ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేశామని గుర్తు చేసారు. తప్పులుంటే బయటపెడితే... అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. యువత దుష్ప్రచారాన్ని నమ్మినట్టు అనిపించిందని కేటీఆర్ పేర్కొన్నారు. దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని అంగీకరించారు. ఆ రోజే స్పందించి ఉంటే బాగుండే అని అభిప్రాయం ఉందన్నారు. తమ వైపు నుంచి చిన్నచిన్న తప్పులు, పొరపాట్లు జరిగినయని కేటీఆర్ పేర్కొన్నారు. సవరించుకొని ముందుకెళ్తామని కేటీఆర్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications