కాలుష్యానికి చెక్ పెడుతున్నాం, మనమే బెటర్: సభలో కేటీఆర్
రాజధాని నగరంలో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు.
హైదరాబాద్: రాజధాని నగరంలో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పారు.
'చార్మినార్ సహా ప్రధాన ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కాలుష్యం వల్ల ఆస్తమా రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు' అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
అంతేగాక, 'హైదరాబాద్‌లో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. చెత్త ద్వారా వెలువడుతున్న కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు' అని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా 49 శాతం, రహదారల్ల వల్ల 33 శాతం, బొగ్గు, సిమెంట్ ఇతర మార్గాల ద్వారా కాలుష్యం ఏర్పడుతున్నట్లు చెప్పారు.

ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం కొంతమేర తక్కువగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు నోటిసులు జారీ చేశాం. కాలుష్య నివారణకు సలహాలు, సూచనల కోసం ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్క్
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్‌లో మెగా లెదర్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మెగా లెదర్ పార్క్ ఏర్పాటు కోసం స్టేషన్ ఘన్‌పూర్‌లో 15 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. లెదర్ పార్కు కోసం రూ. 270 కోట్ల పెట్టుబడులు అవసరమని చెప్పారు. కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో గతంలో నెలకొల్పిన 9 మినీ లెదర్ పార్కులను మెగా లెదర్ పార్కుకు అనుసంధానం చేస్తామని చెప్పారు. కానీ మినీ లెదర్ పార్కులు ఆశించిన మేర పని చేయలేదన్నారు. మెగా లెదర్ పార్కు ఏర్పాటుతో సుమారు 20 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. లెదర్ పార్కుల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications