
కేంద్రాన్ని తిడుతూనే ఢిల్లీలో కేంద్రమంత్రులతో మంత్రి కేటీఆర్ భేటీ.. ఇదో రాజకీయ వ్యూహం!!
తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారా? ఒకపక్క కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూనే మరోపక్క కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారా? తమకు కేంద్రం పట్ల ఎటువంటి భేషజాలు లేవని, కేంద్రం కావాలనే తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

రూటు మార్చిన కేటీఆర్ .. గతానికి భిన్నంగా వ్యూహం
తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో రూటు మార్చినట్లు కనిపిస్తుంది. గతానికి భిన్నంగా ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా కనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. అలాగే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పై ఘాటుగా విరుచుకు పడుతున్నారు మంత్రి కేటీఆర్.

తెలంగాణాకు అన్యాయం చేస్తుందని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, తెలంగాణ రాష్ట్రం పట్ల చిన్న చూపు చూస్తోంది, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని నిత్యం విరుచుకుపడుతున్నారు మంత్రి కేటీఆర్ . తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. బీజేపీ నేతలు తెలంగాణ మంత్రుల అవినీతి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వేళ దమ్ముంటే తనపై కేసులు పెట్టాలని సవాల్ కూడా చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఏకంగా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, త్వరలో జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. నిత్యం తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే మళ్లీ కేంద్రం వద్దకు నిధుల కోసం వెళుతున్న తీరు ఆసక్తికరంగా మారింది.

తరచూ ఢిల్లీ వెళ్తున్న కేటీఆర్ .. తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ
ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ తరచు డిల్లీ వెళుతున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇటీవలే రాజీవ్ చంద్రశేఖర్ తో భేటీకి ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ మళ్లీ తాజాగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తో సమావేశమయ్యారు. హైదరాబాద్ మురుగు నీటి పారుదల మాస్టర్ ప్లాన్, రోడ్ల కు సంబంధించి ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కోరారు. ఎస్టీ పి ప్రాజెక్టుల నిర్మాణానికి 8684.54 కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని, 62 ఎస్టీ పి ప్లాంట్లను నిర్మించడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్ పథకం-2 కింద 2850 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ ఢిల్లీ పర్యటనలు .. రాజకీయమే.. ఆసక్తికర చర్చ
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రధాని మోడీ ఎప్పుడు తెలంగాణకు వచ్చిన సీఎం కేసీఆర్ ఆయనను కలవడం లేదు. మరో పక్క కేటీఆర్ తో సహా తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక పక్క కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయడం లేదని చెబుతూనే మళ్లీ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర నిధుల కోసం కేంద్ర మంత్రులను కలవడం రాజకీయమేనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కేటీఆర్ తరచూ ఢిల్లీ బాట ... తెలంగాణా ప్రజల దృష్టిని ఆకర్షించే యత్నం
కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడగడం, ఆ తరువాత వారు నిధులు ఇవ్వడం లేదని నానా యాగీ చేయడం టిఆర్ఎస్ మంత్రుల అలవాటుగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం పాలనతో విభేదిస్తున్నా, కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వడం లేదని చెబుతూనే మళ్లీ మళ్లీ ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్టిని తన పైకి మళ్లేలా చేస్తున్నారు.