ఆ మాత్రం ఉండాలి.. !!
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సభలోకి రాగానే నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ చిరునవ్వుతో పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ సమయంలో రేవంత్ వెంట పలువురు మంత్రులు ఉన్నారు. రేవంత్ వస్తోండటాన్ని చూసిన కేసీఆర్, ఆయన వెనుకే ఉన్న బీఆర్ఎస్ సభ్యులు మర్యాదపూరకంగా లేచి నిల్చున్నారు.
దీనిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలునని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ గౌరవం ఉంటుందని అన్నారు. నిండు సభలో కేసీఆర్ ను కలిసి, గౌరవం ఇచ్చేంత సంస్కారం రేవంత్ రెడ్డికి ఉంటే చాలునని ఆయన పేర్కొన్నారు. ఇదే సంస్కారం బయట మాట్లాడే మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని చెప్పారు.

రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం ఉంటే మంచిదని కేటీఆర్ చెప్పారు. మీసాలు, గడ్డాలు పెంచడంపైన కేటీఆర్ కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడూ గబ్బర్ సింగ్ కాలేడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి పలువురు మంత్రులు, నాయకులు గడ్డం పెంచడాన్ని ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన గబ్బర్ సింగ్ కాలేరని చురకలు అంటించారు.
గడ్డాలు పెంచడం చాలా సులభమేనని, కోట్లాదిమంది ప్రజలు మెచ్చుకునేలా పరిపాలన చేయడమే అత్యంత కష్టమని కేటీఆర్ అన్నారు. చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా, ప్రతి పేదవాడికీ, అర్హుడైన ప్రతి లబ్దిదారుడికీ సంక్షేమ పథకాలు చేరేలా, రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుని వెళ్లేలా పాలన చేయడమే కష్టతరమని కేటీఆర్ పేర్కొన్నారు. గడ్డం మీసాలు లేవని రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి చెప్పిన మాటలు రాహుల్ గాంధీ, ఆయన తండ్రి రాజీవ్ గాంధీకి కూడా వర్తిస్తుందని సెటైర్లు వేశారు.
నిజానికి- రాహుల్, రాజీవ్ గాంధీని ఉద్దేశించే గడ్డాలు, మీసాల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించాడని తాను అనుకుంటున్నట్లు చెప్పారు కేటీఆర్. తాను ఏపీలో చదువుకోవడాన్ని కూడా రేవంత్ రెడ్డి తప్పు పట్టడం పట్ల స్పందించారు కేటీఆర్. తాను ఆంధ్రాలో చదివితే తప్పు కానీ అల్లుడిని రేవంత్ రెడ్డి అంధ్రా నుంచి తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అల్లుడినే అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు తాను ఏపీలో చదువుకోవడం తప్పెలా అవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications