కెసిఆర్ ఫొటో పెట్టుకుంటామని ఆంధ్రవాళ్లు అంటున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరగడం వల్ల ఆంధ్రలో భూముల ధరలు పెరిగాయని, దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫొటో పెట్టుకుంటామని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారు అంటున్నారని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు కెటి రామారావు అన్నారు. సోమవారం సాయంత్రం శేరిలింగంపల్లికి చెందిన కాంగ్రెసు కార్యకర్తలు టిఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు.
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ఓడరేవులూ విమానాశ్రయాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాదులో సెటిలర్ల ఓట్లు తొలిగిస్తున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంత దుష్ప్రచారం చేసినా హైదరాబాదులో అందరం కలిసే ఉంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో 65 లక్షల జనాభా ఉంటే, 72 లక్షల ఓట్లు ఉంటాయా అని ఆయన అడిగారు. గత 15 ఏళ్ల కాలంలో హైదరాబాదులో ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించిన ఒక్క ఘటన కూడా జరగలేదని ఆయన చెప్పారు .
హైదరాబాదు రోడ్లను అందంగా తీర్చుదిద్దుతామని చెప్పారు. అయ్యప్ప భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ప్రాంతీయ రంగు పులిమే ప్రయత్నాలు చేశారని, అక్రమ నిర్మాణాలు తెలంగాణకు చెందినవారివీ ఆంధ్రకు చెందినవారివీ ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో ఓటర్ల శాతం పెరిగిందని చెప్పారు. హైదరాబాదులో అందరినీ ఒకేలా చూస్తామనే మాటకు సిఎం కెసిఅర్ కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు.

రక్తం చిందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామనే మాటను కెసిఆర్ నిలబెట్టుకున్నారని ఆయన చెప్పారు. గత 15 ఏళ్ల కాలంలో ప్రాంతీయ విద్వేషాలకు చెందిన ఒక్క ఘటన కూడా జరగలేదని ఆయన చెప్పారు. హైదరాబాదులో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్‌లో హైదరాబాదుకు గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ అభివృద్ధి స్తంభిస్తుందని అన్నారని, కానీ తెలంగాణ జరిగే అభివృద్ధి జరుగుతూనే ఉన్నదని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క గొడవైనా హైదరాబాదులో జరిగిందా అని ఆయన అడిగారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications