నారా లోకేష్: జూ.ఎన్టీఆర్‌పై గెలిచారు, కెటిఆర్‌పై ఓడిపోయారు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను అవునన్నా కాదన్నా ఇరువురు ముఖ్యమంత్రుల తనయుల మధ్య పోటీగా అందరూ భావించారు. కెసిఆర్ తనయుడు కెటిఆర్‌కు, చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు మధ్య హైదరాబాద్ ఎన్నికలు పరీక్షగా అనుకున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సీట్లను కెటిఆర్ సున్నా నుంచి 99కి పెంచితే, నారా లోకేష్ 45 నుంచి ఒకటికి తగ్గించారు.
పార్టీ వారసత్వం విషయంలో పోటీకి వచ్చిన సీనియర్ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్‌పై నారా లోకేష్ విజయం సాధించారు. అందుకు తండ్రి నారా చంద్రబాబు నాయుడు తగినంత తోడ్పాటు అందించడమే కాకుండా కుమారుడికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా మార్గాన్ని సాఫీ చేస్తూ వెళ్లారు. దాంతో టిడిపిలో నారా చంద్రబాబు నాయుడి తర్వాత నారా లోకేష్ అనేది స్థరపోయింది. కానీ, తెలంగాణలో కాకున్నా హైదరాబాదులో కెటిఆర్‌పై ఆధిపత్యం సాధించడంలో ఆయన విఫలమయ్యారు.
కెటిఆర్ రాజకీయ ప్రత్యర్థులపై విజయం సాధించడమే కాకుండా వారసత్వ పోటీలో తన సామర్థ్యం, ప్రతిభ ద్వారా ముందంజ వేశారు. పార్టీలో కెసిఆర్ వారసుడిగా ఇప్పుడు కెటిఆర్‌ను చూసే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోదరి కల్వకుంట్ల కవితనే స్పష్టం చేశారు. కెసిఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయనకు పార్టీలో హరీష్ రావు, కవిత పోటీగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కెటిఆర్ తన స్వశక్తి ద్వారానే ఆ సమస్యను పరిష్కరించుకున్నట్లు కనిపిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెటిఆర్, నారా లోకేష్ ప్రతిభ, సామర్థ్యాలకు పరీక్ష పెట్టాయి. ఆ సమరంలో ఇద్దరూ హోరాహోరీ తలపడ్డారు. ఇరువురు కూడా తమ్మీ, అన్నా అనుకుంటూనే ప్రచారంలో సవాళ్లు విసురుకున్నారు. హైదరాబాద్‌పై తమ హక్కుల గురించి, దాని అభివృద్ధి గురించి విమర్శలూ ప్రతివిమర్శలూ చేసుకున్నారు. కానీ చివరకు కెటిఆర్ విజయం సాధించారు. అదెలా జరిగిందో చూద్దాం...

కెటిఆర్ ఇలా..
* అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేశారు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జులకు స్వేచ్ఛను ఇచ్చారు. ఏ వర్గంలోకి వెళ్తే ఆ వర్గానికి తగిన భాషను, బాడీ లాంగ్వేజీని చూపించగలిగారు. బస్తీల్లోకి వెళ్తే వారికి అర్థమయ్యే భాష, హావభావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టెక్కీలతో మాట్లాడినప్పుడు పూర్తిగా వారికి అనుకూలమైన కార్పోరేట్ లాంగ్వేజీ, బాడీ లాంగ్వేజీ చూపించారు.
* ప్రచారంలో డొంక తిరుగుడు లేకుండా సూటిగా చెప్పాల్సిన విషయం చెప్పారు. అందరినీ నమ్మించిన నాయకత్వ ప్రతిభ.
* విజయాన్ని నిర్దేశించే సెటిలర్లలో విశ్వాసం కల్పించ డంలో విజయం.
* మీడియాలో సింహభాగం స్థానం ఆక్రమించటంలో సక్సెస్. మీడియా మేనేజ్‌మెంట్‌లో రాణించారు.
* చంద్రబాబునాయుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆయనకు మీతో పనిలేదని, మీకు తామే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి నమ్మించడంలో విజయం సాధించారు.
* అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి, ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలనే అభ్యర్ధనలో కెటిఆర్ చిత్తశుద్ధిని ప్రదర్శించినట్లు భావించవచ్చు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చేసిన, చేస్తున్న కార్యక్రమాలను అన్ని వర్గాల్లోకి విజయవంతంగా తీసుకుని వెళ్లారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఐటి అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాల వరకు చాలా స్పష్టంగా చెప్పగలిగిన నేర్పును ప్రదర్సించారు.
* సెటిలర్లకూ టికెట్లు ఇవ్వడం ద్వారా, వారి మనోభా వాలు గెలుచుకున్నారు.
* వయసులో చిన్న అయినప్పటికీ నాయని నర్శింహా రెడ్డి, మహమూద్ ఆలీ, తీగల కృష్ణారెడ్డి వంటి పెద్దలతోనూ తలసాని, పద్మారావు వంటి హైదరాబాద్ మంత్రులతోనూ సమన్వయం చేసుకోవడంలో విజయం సాధించారు.
* ప్రచారం తొలి రోజు నుంచీ టీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం సృష్టించడంలో ఫలించిన వ్యూహం. ప్రత్యర్ధు లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా, నగరం నిండా వందల సంఖ్యలో పార్టీ హోర్డింగులు మోహరించడం ద్వారా, నగరంలో టీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం ఉందన్న భావన కల్పించడంలో సక్సెస్ అయ్యారు.
* తండ్రి కేసీఆర్ రాకపోయినా, ప్రభుత్వ-ప్రైవేటు నిఘా సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని, దానితో అభ్యర్ధులను విజయావకాశాలకు దగ్గర చేర్చారు.
* టికెట్ల పంపిణీ తర్వాత అసంతృప్తులు చేజారిపోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులకు పార్టీలో తమ ప్రత్యర్థులని అనుకున్నవాళ్లను కూడా ఎలా కలుపుకుని ముందు వెళ్లాలో నిర్దేశించగలిగే ప్రతిభను కనబరిచారు.
నారా లోకేష్ ఇలా...
* నారా లోకేష్ ప్రవేశం భారీగా జరిగినా, ఆయన ఎవరిలోనూ, ఏ స్థాయిలోనూ నమ్మకం కల్పించలేకపోయారు. చివరకు సొంత కమ్మ సామాజికవర్గానికీ భరోసా ఇవ్వలేకపో యారు.
* అభ్యర్ధుల ఎంపికలో అనుభవరాహిత్యం బయట పడింది. గతంలో నగర రాజకీయాల్లో అనుభవం ఉండి, తగిన సూచనలు చేయగల ఎమ్మెల్సీ టిడి జనార్దన్‌రావు, ఎంపి గరికపాటి మోహన్‌రావు, రాష్ట్ర నేత అరవిం దకుమార్‌గౌడ్‌ను అభ్యర్ధుల ఎంపికలో ఎక్కడా భాగస్వామ్యం చేయలేదు. నగర అధ్యక్షుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కూడా అభ్యర్ధుల ఎంపికపై ప్రభావం చూపింది.
* నగర రాజకీయాలు, నగర పార్టీ, నగర స్వరూపంపై పెద్దగా అవగాహన లేని ఎల్.రమణ, దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిని అభ్యర్ధుల ఎంపికలో ముందుపెట్టడం వల్ల సరైన అభ్యర్ధుల ఎంపికలో లోపాలు జరిగాయి. లోకేష్ ఎక్కువగా వారిపైనే ఆధారపడ్డారన్న విమర్శలు వచ్చాయి.
* టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. దాన్ని తిప్పికొట్టి పార్టీపై విశ్వాసం నింపడంలో విఫలమయ్యారు.
* లోకేష్ తన మిత్రుడు చేయించిన సర్వేలపైనే ఆధారపడటం వల్ల గ్రేటర్ ఎన్నికల్లో నష్టపోయారు. పార్టీ నిర్వహిస్తున్న సర్వేల సమర్ధులకు అన్యాయం జరిగి, అసమర్ధులకు స్థానం లభించిందన్న సంకేతాలు పంపారు.
* టికెట్లు రాని నాయకులను పిలిచి భరోసా కల్పించడం, వారికి టికెట్లు వచ్చిన వారితో సఖ్యత కుదిర్చి పనిచేయించడంలో విఫలమయ్యారు.
* లోకేష్ బాగా తిరిగి, ప్రచారం చేసినప్పటికి చంద్రబాబునాయుడు ఇక్కడ ఉండరని, తమకే ఓటు వేయాలన్న కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమయ్యారు.
* ప్రచారంలో లోకేష్ ప్రసంగాలు ఒకే రీతిలో సాగి ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. ఎంత సేపు చంద్రబాబు హైదరాబాద్ కోసం చేసిన అభివృద్ధిని మాత్రమే చెబుతూ పోయారు. అలాగే, తాను హైదరాబాదులో పుట్టానని, తాను హైదరాబాదీనే అని చెప్పారు. ఓ వైపు, హైదరాబాదులో పుట్టనివారైనా సరే, ఇక్కడ ఉంటున్నవాళ్లందరికీ తమ పార్టీ అండగా ఉంటుందనే కెటిఆర్ హామీకి సరైన జవాబు ఇవ్వలేకపోయారు.












Click it and Unblock the Notifications