కేటీఆర్‌కు సిరిసిల్లలో ఓటమే: కేసీఆర్ సర్కారుపై ధర్మపురి అరవింద్ ఫైర్
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్లలో ఓటమి తప్పదని భారతీయ జనతా పార్టీ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్లలో ఓటమి తప్పదని భారతీయ జనతా పార్టీ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఇందూరుకు కేటీఆర్ ఎందుకు వచ్చారని అరవింద్ ప్రశ్నించారు. బీజేపీ, అరవింద్‌పై నిజామాబాద్ పర్యటనలో కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు.
నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్, కేటీఆర్ చేసిందేమిటి? అని నిలదీశారు అరవింద్. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే.. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదని ఆరోపించారు. బీజేపీని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు.

ఇందూరు ప్రజలను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు ధర్మపురి అరవింద్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదు కానీ.. తిలక్ గార్డెన్ గుర్తుకు వచ్చి నిధులు కేటాయించారని విమర్శించారు. 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్‌ను అరవింద్ ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముందుస్తు ఎన్నికలకు పోతే.. సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఓడిపోతారన్నారు ధర్మపురి అరవింద్. ఇందూరు సభలో కేటీఆర్ రిజైన్ చేస్తాననగానే అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారంటూ గుర్తు చేశారు అరవింద్. పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప.. వీళ్లు చేసిందేమీ లేదని కేసీఆర్, కేటీఆర్ పై అరవింద్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సామాన్యుల పరిస్థితి మరింత దిగజారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications