మోడీ వాగ్ధానాలకు టైమొచ్చిందంటూ నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని అన్నారు. ఎనిమిదేళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకమని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులకు జాతీయ ప్రాధాన్యత ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు రానున్న కేంద్ర బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కేటీఆర్ కోరారు.

జహీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా నిధులు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ - నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు ఆర్థిక సాయం చేయాలన్నారు. హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు.
జడ్చర్ల పారిశ్రామిక పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు మంజూరు, అప్‌గ్రేడేషన్ చేయాలన్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలన్నారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని కేటీఆర్ సూచించారు. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఎనిమిదేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తోందని.. తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని కేటీఆర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications