తెలంగాణ మాల్దీవులు ఎక్కడో తెలుసా..? హైదరాబాద్ కు దగ్గరలోనే.. బెస్ట్ వన్ డే ట్రిప్ ఎక్స్ పీరియన్స్..
తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చారిత్రక కట్టడాలు.. కొండలు.. కోనలు.. ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవుగా తెలంగాణ ప్రాంతం ఉంటుంది. ఇక వీకెండ్ వస్తే చాలు చాలామంది ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తుంటారు. వారంలో కనీసం ఒక్కరోజైనా ప్రశాంతమైన వాతావరణంలో మనసును హాయిగా ఉంచుకోవాలని చూస్తుంటారు. అయితే హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలను ఇప్పటికే చూసేసి ఉన్నా మరోసారి వెళ్లేందుకు బోర్ కొడుతుంది. అంతేకాక నగరంలోని ట్రాఫిక్ రణగొణుల మధ్య ఎక్కడికైనా వెళ్లాలనే మూడ్ కూడా మారిపోతోంది.
అందుకే చాలా మంది నగరానికి దూరంగా వెళ్లి వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే హైదరాబాద్ నగరం అవతల తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న కొండ ప్రాంతాలు.. రిజర్వాయర్లు లాంటి ప్రదేశాలకే ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఇటీవలి కాలంలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఉన్న లక్నవరం జలాశయం బాగా ఫేమస్ అవుతోంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక భూతల స్వర్గధామంగా చెబుతారు. వరంగల్ నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అలాగే హైదరాబాద్ నుంచి సుమారు 210 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో ఈ అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఉంది.
ఇక లక్నవరం సహజమైన అందాలకు నెలవైన ప్రదేశంగా ఉంది. మాల్దీవులను గుర్తుకుతెచ్చే విధంగా లక్నవరం అందాలు పోటీ పడుతూ సందర్శకులను రా రమ్మని స్వాగతం పలుకుతున్నాయి. సహాజసిద్ధమైన అందాలతో నిండిన ఈ ప్రదేశం ఇటీవలికాలంలో పర్యాటకుల మదిని దోచే అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ ఉన్న మూడు ప్రత్యేక ద్వీపాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తీగల వంతెన ద్వారా మొదటి ద్వీపానికి చేరుకుంటే ఇక అక్కడి నుంచి రెండో ద్వీపానికి, మూడో ద్వీపానికీ తీసుకెళ్లడానికి స్పీడ్ బోట్లను ఏర్పాటు చేశారు.

లక్నవరం చెరువుకు వీకెండ్స్ తో పాటు సాధారణ రోజుల్లోనూ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న సందర్శకులు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండి సహజ సిద్ధ అందాలను తనివితీరా తిలకిస్తున్నారు. ఇక ఇక్కడి అందాలను చూసిన తెలంగాణ పర్యటకులు దీనిని ముద్దుగా తెలంగాణ మాల్దీవులు లేదా తెలంగాణ కోనసీమ అని పిలుస్తున్నారు. నీటి మధ్యలో 13 దీవులు ఉండగా వీటిని తిలకించేందుకు అద్భుతమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి తెలంగాణ మాల్దీవుల అందాలపై ఓ లుక్కేయండి..












Click it and Unblock the Notifications
