లక్ష్మి తులసి హత్య, దోపిడీ: సిఐపై బదిలీ వేటు
హైదరాబాద్: రాష్ట్ర రాజదాని లంగర్‌హౌస్ సీఐ ఎంవీ రత్నంపై బదిలీ వేటు పడింది. లంగర్‌హౌస్‌లో వృద్ధురాలి హత్య, దోపిడీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు సీఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం లంగర్‌హౌస్ సీఐగా జావీద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యంత దారుణంగా ఓ మహిళను హైదరాబాదులోని లంగర్‌హౌస్ ప్రాంతంలో ఇటీవల పట్టపగలు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిఐపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది.
లంగర్‌హౌజ్ మిలటరీ క్యాంపు పక్కనే ఉన్న ఓంనగర్ కాలనీలో మిట్ట మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య రిటైర్డ్ ప్రొఫెసర్ సత్యనారాయణ, లక్ష్మీతులసి దంపతులు నివాసం సాయి నిలయంలో ఆ ఘోరం జరిగింది. అంగవైకల్యం కారణంగా కుర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న అరవై ఏళ్ల లక్ష్మీ తులసి సేదదీరుతున్నారు.. కరెంటు వాళ్లమంటూ ఇద్దరు అగంతకులు ఇంట్లోకి ప్రవేశించారు. కదల్లేని స్థితిలో కుర్చీకే పరిమితమైన వృద్ధురాలిపై మానవత్వం మరచి దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి కర్కశంగా గొంతుకోసి హత్య చేశారు. తాపీగా ఇంట్లో ఉన్న 70 తులాల బంగారం, కిలోన్నర వెండి ఆభరణాలతోపాటు, విలువైన ఎలక్ట్రానిక్ సామానులనూ దోచుకెళ్లారు. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు.

లక్ష్మీ తులసి భర్త సత్యనారాయణ ఉద్యోగవిరమణ తర్వాత పంజాగుట్టలోని ముఖాన్‌జఫా గ్రంథాలయంలో పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన గ్రంథాలయానికి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తలుపు బయటి నుంచి గడియపెట్టి ఉండటంతో తీసుకుని లోపలికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మడుగులో భార్య లక్ష్మీ తులసి కనిపించింది. ఆందోళనకు గురైన ఆయన లంగర్ హౌజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఇంట్లో పనిచేసే మహిళను విచారించగా, తనను పనిలోకి రావద్దని యజమానురాలు చెప్పడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లిపోయానని తెలిపింది. గతంలో పనిచేసి మానేసిన చంద్రకళను కూడా పోలీసులు విచారించారు. సుల్తానా అనే మరో మహిళ కూడా లక్ష్మీ తులసి ఇంట్లో పనిచేస్తుందని, రెండురోజులుగా ఆమె కన్పించడం లేదని పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఇంటిపైన అద్దెకుండే శ్రీనివాస్ అనే వ్యక్తినీ పోలీసులు విచారించారు. తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పశ్చిమ మండల డీసీపీ సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్టు తెలిసిందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు. సత్యనారాయణ ఇల్లు మిలటరీ క్యాంపస్ పక్కన నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉందని, ఇంట్లో లక్ష్మీ తులసి ఒక్కటే ఉండటం గమనించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications