శ్రీలీల.. తొక్కిపడేసిందిగా: డజను క్రేజీ సినిమాలు
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఇప్పుడు శ్రీలీల హవా నడుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గడప తొక్కిన అతి తక్కువ సమయంలోనే బిజీ నటి అయిపోయింది. చేతినిండా సినిమాలతో తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతోంది. తెలుగుతో పాటు కన్నడ సినిమాలను కౌంట్‌లోకి తీసుకుంటే.. 2024 సంక్రాంతి నాటికి కనీసం ఎనిమిది సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారం, నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండింట్లోనూ ఆమెది కీలక పాత్రే. భగవంత్ కేసరిలో బాలకృష్ణకు కూతురి క్యారెక్టర్‌లో కనిపిస్తుందనేది టాక్. భగవంత్ కేసరిలో చిచ్చా అంటూ బాలకృష్ణను పిలవడంతో ఈ టాక్ బయటికొచ్చింది.

ఈ రెండు సినిమాలు కూడా సగానికి పైగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాయి. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల కానుంది. భగవంత్ కేసరి ఈ ఏడాది దసరాకు సందడి చేయనుంది. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.
శ్రీలీల నటించిన స్కంద మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ప్రభాస్ సలార్ సినిమా అదే తేదీకి విడుదల కావాల్సి ఉండగా.. అది పోస్ట్ పోన్ అయింది. దీనితో ఆ స్లాట్‌ను స్కంద యూనిట్ బుక్ చేసుకుంది. రామ్ పోతినేని-బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
ఈ మూడు సినిమాల వద్దే శ్రీలీల హవా ఆగట్లేదు. వరుస బెట్టి సినిమాలకు సైన్ చేస్తోంది. స్కంద, గుంటూరు కారం, భగవంత్ కేసరీ కాకుండా.. వైష్ణవ్ తేజ్ సరసన ఆది కేశవలో నటిస్తోంది. డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది సినిమా. నితిన్‌తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీలో మెరుపులు మెరిపించబోతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లోనూ లీడ్ క్యారెక్టర్ ఆమెదే. పూజా హెగ్డే మరో హీరోయిన్. పంకజ్ త్రిపాఠి, అశుతోష్ రాణా కీలక పాత్రలను పోషిస్తోన్నారు. కిరీటి రెడ్డి సరసన జూనియర్ సినిమాకూ సైన్ చేసింది శ్రీలీల. విజయ్ దేవరకొండతోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.
నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న అనగనగా ఒకరోజులో కథనాయికగా సెలెక్ట్ అయింది. కన్నడలో దుబారి సినిమాను చేస్తోంది. ధృవ సర్జా హీరో. గుంటూరు కారం ఒక్కటి తప్పిస్తే.. మిగిలిన సినిమాలన్నీ కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications