మరో ఎన్నికల సమరానికి సై - షెడ్యూల్ ఫిక్స్, గెలుపెవరిది..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణ పైన వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ఇది సరైన సమయంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కీలకంగా మారుతోంది. కాగా, ఈ ఎన్నికలకు ముహూర్తం దాదాపు ఖరారు కావటం తో విజయం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు మొదటి వారంలో షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు 29న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం సెప్టెంబరు తొలి వారంలో నోటిషికేషన్ ఇచ్చి, నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీలో ఎన్నికలు, రిజర్వేషన్ల పైన చర్చించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది జరిగే అవకాశం తక్కువగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీలకు సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లాలని దాదాపు నిర్ణయించింది. పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడు ప్రత్యామ్నాయాలను నేతల ముందుంచారు. మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ 26వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత న్యాయ సలహా తీసుకొని 29వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
29వ తేదీన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలను వెళ్లాలనుకొంటే ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. కాగా, ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకొని ఉన్నందున మొదటి వారంలో షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ సైతం ఎన్నికలకు సిద్దమని చెబుతోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని.. తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఈ ఎన్నికల ద్వారా తమ బలం పెరిగిందనే విషయం స్పష్టమవుతోందని చెబుతున్నారు. దీంతో, తెలంగాణలో ఈ ఎన్నికల సమరం ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications