ఆ రోజులు ఎంతో దూరంలో లేవు: రేవంత్ సర్కార్‌పై బాంబు పేల్చిన హరీష్ రావు
Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అధిగమించిన భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ బరిలో ఎదురైన పరాజయాన్ని ఇక్కడ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది.
తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరిష్ రావు దీనికి సారథ్యాన్ని వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పీ రాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తల అభిప్రాయాల మేరకు పార్టీ అగ్రనాయకత్వం నడుచుకుంటుందని, వారి సూచనల మేరకే పని చేస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు పని చేసినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రతి పక్షంలో కూర్చున్నందుకు అధైర్య పడాల్సిన అవసరం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదని వ్యాఖ్యానించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో కూడా అయిదేళ్లకే ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారడం కొత్తేమి కాదని అన్నారు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమౌతాయని, అంత బడ్జెట్ లేదని హరీష్ రావు అన్నారు. ఎలాగూ అధికారంలోకి రావట్లేదనే ఉద్దేశంతో బడ్జెట్‌కు మించిన హామీలను కాంగ్రెస్ నేతలు ఇచ్చారని, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రూపొందించారని విమర్శించారు.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందే తప్ప ప్రజా బలంతో కాదని హరీష్ రావు స్పష్టం చేశారు. హామీల గురించి డిమాండ్ చేస్తే అనవసర విషయాలు తెరపైకి తెస్తోన్నారని ఆరోపించారు. కర్ణాటకలో అయిదు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఇక్కడా అదే పరిస్థితి వస్తుందని అన్నారు.

కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు గురించి వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని హరీష్ రావు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రతిరోజూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం లభిస్తుందని వివరించారు.
కాంగ్రెస్ బీజేపీల మైత్రి గుచించి బండి సంజయ్ బహిరంగంగా ఒప్పుకొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదేనని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టారని విమర్శించారు.
దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అంటూ ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడే పర్యటిస్తోన్నారని, దీనికి ఏమని బదులిస్తారని హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వంద రోజులు చేసుకోలేదనే ఉద్దేశంతోనే ఇంకా ఆగుతున్నామని.. లేకపోతే చీల్చి చెండాడే వాళ్లమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications