రేవంత్ రెడ్డి సత్తాకు అగ్నిపరీక్ష: భుజస్కందాలపై బిగ్ టాస్క్
Revanth Reddy: దేశంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నాటికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి.. ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టాయి.
ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరం మినహాయిస్తే- మూడు చోట్ల బీజేపీ, ఒక దాంట్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా మారిందనేది బహిరంగ రహస్యం.

ఇదే దూకుడును అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సంస్థాగతంగా ప్రక్షాళనకు పూనుకుంది. దీని కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాజాగా తొమ్మిది రాష్ట్రాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. తెలంగాణ, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర.. ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణలో ఏర్పాటైన కమిటీకి ఛైర్మన్‌గా పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీ జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కుందూరు జానా రెడ్డి, వీ హనుమంతరావు, చల్లా వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు.
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మధు యాష్కీ గౌడ్, ఎస్ ఏ సంపత్ కుమార్, రేణుకా చౌదరి, పీ బలరామ్ నాయక్, జగ్గా రెడ్డి, డాక్టర్ గీతా రెడ్డి, మహ్మద్ అజరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, బీ మహేష్ కుమార్ గౌడ్, మహ్మద్ షబ్బీర్ అలీ, ప్రేమ్ సాగర్ రావు, పోడెం వీరయ్య, ఎం సునీత రావు ముదిరాజ్.. ఈ కమిటీలో సభ్యులు.
తెలంగాణ యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు, సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్.. ఎక్స్ అఫీషియో సభ్యులుగా అపాయింట్ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది కాంగ్రెస్. దీన్ని అందుకోవాల్సిన టాస్క్‌ను రేవంత్ భుజస్కందాలపై ఉంచింది.












Click it and Unblock the Notifications