మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడికిపోయినాయ్..!!
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ఉప ఎన్నిక ప్రచారానికి ఈ సాయంత్రంతో తెర పడబోతోంది.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

పోలింగ్ సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ ఫిర్యాదు అందింది.
తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సంరక్షణ బాధ్యత వహించిన వ్యక్తుల నిర్లక్ష్యం, మితిమీరిన జోక్యం చోటు చేసుకుందని మహానంద కుమారి ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. మూత్రపిండాల సమస్యలకు చికిత్స కోసం ఈ ఏడాది జూన్ 5న ఆసుపత్రిలో చేరగా.. జూన్ 8న ఆయన మరణించినట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గోపీనాథ్ ఐసీయూలో ఉన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనను చూడటానికి అనుమతించలేదని ఆరోపించారు.
ఇదే విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ప్రస్తావించారు. గోపీనాథ్ ఆస్తులపై కేటీఆర్ కన్ను వేశాడని ఆరోపించారు. ఆయన ఆస్తుల డాక్యుమెంట్లను తారుమారు చేశారని విమర్శించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నెలకిందటే గోపీనాథ్ కొడుకుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పారు.
ఆయన వారసుల పత్రాలనే ఫోర్జరీ చేయగలిగితే, ఇక సాధారణ ప్రజల డాక్యుమెంట్లకు రక్షణ ఎలా ఉంటుందని బండి సంజయ్ ప్రశ్నించారు. అమెరికాలో ఉంటోన్న గోపీనాథ్ కుమారుడిని తెలంగాణకు రావొద్దని, వస్తే చంపేస్తామని ఓ మాజీ మంత్రి సైతం ఫోన్ చేసి బెదిరించారని విమర్శించారు. మాగంటి సునీతకు రెండు ఓటరు ఐడీలు ఉన్నాయని, 2023, 2025లో సమర్పించిన అఫిడవిట్లలో ఆమె విద్యా అర్హతలు వేర్వేరుగా ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications