హైదరాబాద్ నూతన సీపీ మహేష్ భగవత్ తొలి హెచ్చరిక..!!
హైదరాబాద్ నగర నూతన పోలీసు కమిషనర్(సీపీ)గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. తన ప్రాధాన్యతలను వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలకు తమ బృందం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అనుభవజ్ఞులైన అధికారులందరితో కలిసి సమష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలా పాలపై ఉక్కుపాదం మోపుతామని సీపీ మహేష్ భగవత్ హెచ్చరించారు.
హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. సజ్జనార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలుగా పేర్కొన్నారు. ప్రతి ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని.. అందుకే ఈ అంశాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. మరోవైపు ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయని.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. హైదరాబాద్‌లో అనుభవం ఉన్న అధికారులు ఎందరో ఉన్నారని చెప్పిన నూతన సీపీ.. మేమందరం కలిసి టీమ్‌గా పని చేస్తామని పేర్కొన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మని... పీడీ యాక్ట్‌లు పెడతామని హెచ్చరించారు.

సజ్జనార్ కు అభినందనలు
కాగా, పాత నేరస్థులపై నిఘా పెట్టడమే కాకుండా నేరాలు చేసిన వారికి శిక్ష పడేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ భరోసా ఇచ్చారు. గతంలో సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్, సజ్జనార్‌లను అభినందించారు. వారు ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు. అలాగే ప్రజల కోసం మరికొన్ని సేవలు తీసుకొస్తామని తెలిపారు. డయల్ 112 రెస్పాన్స్ మరింత మెరుగుపరి చేలా పని చేస్తామన్నారు. వ్యవస్థికృత నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెడతామని... సాయంత్ర వేళల్లో నేరాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బేసిక్ పోలీసింగ్‌పై దృష్టి సారిస్తా మని వెల్లడించారు . సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో కూర్చోవడం కాకుండా సాయంత్రం రోడ్‌పై డ్యూటీ చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు బుక్ చేయటంతో పాటుగా శాఖాపరమైన చర్యలూ తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉందని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తామని భగవత్ వెల్లడించారు.













Click it and Unblock the Notifications
