సాగర్ రింగ్ రోడ్ వద్ద 6- లేన్ భారీ ఫ్లైఓవర్..!!
శరవేగంగా విస్తరిస్తోన్న హైదరాబాద్ లో సిటీలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మితం కానుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు ఇది రూపుదిద్దుకోనుంది. దీని నిర్మాణ వ్యయం 410 కోట్ల రూపాయలు. 6- లేన్ల భారీ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్ ఇది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని నిర్మించనుంది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను కూడా ఆరంభించింది. ఈ నెల 20 వరకు బిడ్స్ దాఖలు చేయవచ్చు. 22వ తేదీన బిడ్స్ ఫైనల్ అవుతాయి.
టెండర్లు ఖరారైన వెంటనే పనులు ప్రారంభమౌతాయని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి, గాయత్రీనగర్, మంద మల్లమ్మ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఉప్పల్ నుంచి మిధాని వరకు వాహనాల రాకపోకలు మరింత మెరుగుపడతాయి. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు జాతీయ రహదారి వైపు వెళ్లడానికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.

మొత్తం మూడు జంక్షన్లు- తీగల కృష్ణారెడ్డి, గాయత్రీనగర్, మందమల్లమ్మల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహనాల మళ్లింపుపై ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు.. హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులతో సమావేశమైనట్లు చెబుతున్నారు. ఎటువంటి గందరగోళం లేకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలపై ముందుగానే చర్యలు తీసుకుంటోన్నారు.
మీర్ పేట్, బాలాపూర్, బడంగ్ పేట్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వందలాది వాహనాలు మందమల్లమ్మ జంక్షన్ వద్ద స్తంభించిపోతున్న విషయం తెలిసిందే. అక్కడ రోడ్డు దాటడం గగనంగా మారింది. అటు జిల్లెలగూడ, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు గాయత్రినగర్ జంక్షన్ దగ్గర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 6- లేన్ల ఫ్లైఓవర్ వల్ల సిటీలోనికి ఎంట్రీ/ఎగ్జిట్ సులభతరమౌతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications