తమిళనాడు దివంగత సీఎం జయలలిత డబ్బులు కాజేసి మల్లారెడ్డి పైకొచ్చారట!!
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి మల్లారెడ్డి పాలమ్మి, పూలమ్మి ధనవంతుడు కాలేదని తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి ఆస్తులు కాజేసి పైకి వచ్చాడని కామెంట్స్ చేశారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మంత్రి మల్లారెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివారులోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని, అందులో డైరీ ఫామ్ ఉండేదని ఆయన పేర్కొన్నారు . ఆ సమయంలో పాల వ్యాపారం చేయడానికి అక్కడికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఆమె డబ్బులు కాజేశారన్నారు.

ఐటీ దాడులు జరుగుతున్నట్లు జయలలితకు సమాచారం ఉండడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఒకచోట దాచిపెట్టారని, వాటిని ఆయన దొంగిలించాడని, అలాగే మల్లారెడ్డి ధనవంతుడు అయ్యాడని పేర్కొన్నారు. అంతేకాదు తన ఇంటి పక్కనే ఉండే క్రిస్టియన్ విద్యాసంస్థల యజమానురాలిని మోసం చేసి, ఆమె కు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని, మరణం తర్వాత ఆమె ఆస్తిని కాజేశారని ఆరోపించారు.
మైసమ్మగూడ లో చెరువు స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టారని పేర్కొన్నారు. ఫలితంగా మొన్న వరదలకు కాలేజీల్లోకి నీళ్ళు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, మంత్రి మల్లారెడ్డి చెయ్యని అవినీతి లేదంటూ మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి ఆయన బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉండి చేసిందేమీ లేదని, తమ వ్యాపారాల కోసం మేడ్చల్ నియోజకవర్గాన్ని నాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.
ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయనపై మండిపడ్డారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి తనదైన మాస్ స్టైల్ లో ప్రచారం చేస్తూ దూసుకుపోతుంటే, మల్లారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తో పాటుగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మల్లారెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications