ఆడపిల్లను కనడమే పాపమా.. ఓ మృగాడి ఆకృత్యానికి మహిళ బలి
వినా స్త్రీ యా జననం నాస్తి.. వినా స్త్రీ యా గమనం నాస్తి.. వినా స్త్రీ యా జీవం నాస్తి.. వినా స్త్రీ యా సృష్టి యేవ నాస్తి.. ఈ పద్య భావం అందరికీ తెలిసే ఉంటుంది. స్త్రీ లేకపోతె జననం లేదు, స్త్రీ లేకపోతె గమనం లేదు.. స్త్రీ లేకపోతె జీవం లేదు, స్త్రీ లేకపోతె సృష్టే లేదు.. పుస్తకాల్లో చదివిన దానికంటే కూడా సినిమా డైలాగ్ గానే అందరికీ బాగా గుర్తు ఉండి ఉంటుంది. కానీ మగాడి పుట్టుకకు కారణమైన స్త్రీ మూర్తిని కనడానికి మాత్రం.. కాలయముడిలా మారిపోతున్నారు కొందరు మృగాళ్లు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆడపిల్లలు పుట్టడమే తప్పు.. అనేట్టు పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఓ బాధాకర ఘటన తెలంగాణలోని కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరిలో జరిగింది. గ్రామానికి చెందిన డోకే జయరామ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక అమ్మాయి పుట్టిన తర్వాత మగబిడ్డ కోరికతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య భానక్కకి కూడా ఇద్దరు అమ్మాయిలే పుట్టడంతో, అతనికి మళ్లీ నిరాశ వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలోనే నిన్న ( ఏప్రిల్ 23, 2025 ) రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది. కోపంతో జయరామ్ తన భార్య భానక్క తలపై వ్యవసాయ పనికి వాడే పలుగుతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆడపిల్ల పుట్టడం అనేది శాపం కాదు.. అది ఓ గొప్ప వరం అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. కుటుంబంలోని వారంతా ఆడపిల్లలపై గౌరవం, ప్రేమ చూపాలని కోరుతున్నారు. అప్పుడే ఇలాంటి దారుణాలు తగ్గుతాయని.. మనమంతా కలిసి ఆడపిల్లలను ఆదరించి, రక్షించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు. గత కొన్ని ఏళ్లల్లో తెలంగాణలో ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెబుతున్నారు. పలు జిల్లాల్లో 1000 మంది అబ్బాయిలకు 850 మంది కన్నా తక్కువ ఆడపిల్లలే పుడుతున్నారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications