ఈ నదుల నీళ్లు తాగుతున్నారా? పీసీబీ నివేదికలో విస్తుపోయే నిజాలు!
తెలంగాణలో నదుల కాలుష్యంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) విడుదల చేసిన రిపోర్టు ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణలో నాలుగు నదీ పరివాహక ప్రాంతాలను కాలుష్య రహిత జాబితాలోకి మార్చినప్పటికీ.. మంజీర, మూసి, కృష్ణ, గోదావరి నదుల్లో కాలుష్య శాతాలు పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ముఖ్యంగా వీటిలో హైదరాబాద్ మహానగరంలో చాలా వరకు దాహం తీర్చే మంజీర నది అత్యంత తీవ్రంగా కాలుష్యానికి గురైనట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) 2022లో తెలంగాణలో 9 నదీ పరివాహక ప్రాంతాలను కాలుష్య కాసారాలుగా గుర్తించింది. అయితే తాజాగా సవరించిన రిపోర్టు ప్రకారం నక్కవాగు, కరకవాగు, కిన్నెరసాని, మున్నేరు నదులకు చెందిన 4 పరివాహక ప్రాంతాలను ఈ కాలుష్య జాబితా నుంచి తొలగించడం గమనార్హం. మిగిలిన 5 ప్రాంతాల్లో మానేరు నదిలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ నమూనాలను సేకరించలేకపోయినట్లు పీసీబీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.

నదీ జలాల నాణ్యతను అంచనా వేసేందుకు బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ)ను కీలక ప్రమాణంగా పరిగణిస్తారు. సాధారణంగా నదీ నీరు సురక్షితంగా ఉండాలంటే బీవోడీ స్థాయి లీటరుకు 3 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ మంజీర నదిలో సింగూరు నుంచి పాపన్నపేట మధ్య బీవోడీ స్థాయి ఏకంగా లీటరుకు 12 మిల్లీగ్రాములుగా నమోదైంది. ఇది సాధారణ పరిమితి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
మరోవైపు హైదరాబాద్ జీవనాడి అయిన మూసి నది కూడా తీవ్ర కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. బాపూఘాట్ నుంచి నది కృష్ణాలో కలిసే వాడపల్లి వరకు ఉన్న పరివాహక ప్రాంతంలో మూసి నది బీవోడీ స్థాయి లీటరుకు 9 మిల్లీగ్రాములుగా నమోదైంది. ఇది పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇక జీవనదులైన కృష్ణ, గోదావరి నదులలో కూడా బీవోడీ స్థాయిలు పరిమితిని దాటాయి. గద్వాల బ్రిడ్జి నుంచి వాడపల్లి మధ్య కృష్ణా నదిలో 3.6 మిల్లీగ్రాములు, పొచ్చెర జలపాతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మధ్య గోదావరి నదిలో 3.6 మిల్లీగ్రాముల చొప్పున బీవోడీ నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా నదులు, చెరువులు, బోరు బావులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీలు), కాలువల పరిధిలోని 57 ప్రాంతాల నుంచి పీసీబీ క్రమం తప్పకుండా 580 నీటి నమూనాలను సేకరించి ఈ విశ్లేషణ నిర్వహించినట్లు నివేదిక స్ఫష్టం చేసింది.














Click it and Unblock the Notifications
