IPL 2027: ఐపీఎల్ మినీ వేలానికి ముందు బీసీసీఐ సడెన్ ట్విస్ట్!
IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను సమర్పించడానికి ఇచ్చిన గడువును మరో రెండ్రోజులు పొడిగించింది. దీంతో ఫ్రాంచైజీలు నవంబర్ 17వ తేదీ వరకు తమ తుది జాబితాను అందజేసే వెసులుబాటు లభించింది. అంతకుముందు ఈ డెడ్‌లైన్ నవంబర్ 15గా నిర్ణయించబడింది.
గడువు పొడిగింపునకు కారణం
నవంబర్ 2న బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఈ సమాచారాన్ని అందించినట్లు తెలిసింది. నవంబర్ 15వ తేదీన న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనుయ్(బే ఓవల్) వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కారణంగానే ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు బీసీసీఐ అదనంగా రెండ్రోజులు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది.

వేలం వేదిక, తేదీలో నో ఛేంజ్
రిటెన్షన్ డెడ్‌లైన్ మారినప్పటికీ.. ఐపీఎల్ మినీ వేలం జరిగే తేదీ, వేదికలో ఎలాంటి మార్పులు లేవు. ముందుగా ప్రకటించినట్లే డిసెంబర్ 16వ తేదీన గోవా వేదికగా ఈ మినీ వేలం నిర్వహించనున్నారు. విశేషమేమిటంటే.. వేలం జరిగే డిసెంబర్ 16నే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-శ్రీలంక దేశాల మధ్య రెండో వన్డే మ్యాచ్ కూడా జరగనుంది. అయినప్పటికీ వేలం షెడ్యూల్‌ను మార్చే ఆలోచన ఏదీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2027 మినీ వేలం పూర్తి షెడ్యూల్ వివరాలు
*నవంబర్ 2: ప్లేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
*నవంబర్ 17: ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాను సమర్పించడానికి చివరి తేదీ.
*నవంబర్ 23: ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ విండో ముగింపు.
*డిసెంబర్ 1: వేలం కోసం ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ప్రాధాన్యత కలిగిన ప్లేయర్ల జాబితాను అందజేయాలి.
*డిసెంబర్ 3: ఆటగాళ్ల సెట్లు, ఫైనల్ వేలం రిజిస్టర్ విడుదల.
*డిసెంబర్ 16: గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహణ.














Click it and Unblock the Notifications
