బైక్ కొనిస్తేనే తాళి కడతానంటూ తేల్చేసిన వరుడు! ఎమెల్యే రసమయి ఎంట్రీతో మారిన సీన్
కరీంనగర్: మరికొద్ది క్షణాల్లో సందడిగా ఉన్న పెళ్లి మండపంలో ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. అయితే, వరుడు మాత్రం తనకు బైక్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టాడు. లేదంటే తాను వధువు మెడలో తాళి కట్టేది లేదంటూ తెగేసి చెప్పేశాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే సమయంలో అక్కడికొచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఉదారతను చాటుకున్నారు. బైక్ తాను కొనిస్తానని పెళ్లి ఆగకూడదని చెప్పడంతో.. వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో అక్కడంతా సంతోషకర వాతావరణం నెలకొంది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ, మల్లయ్య కూతురు అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో శుక్రవారం(మే 12న) వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు.

శుక్రవారం కేశవపట్నంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్‌లో వివాహం జరుగుతున్న సమయంలో కట్నంలో భాగంగా తనకు ఇవ్వాల్సిన బైక్ ఇవ్వలేదని.. బైక్ కొనిస్తేనే తాళి కడతానని పెళ్లికొడుకు తేల్చి చెప్పాడు. దీంతో పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పెళ్లి తర్వాత బైక్ కొనిస్తామని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినా.. వరుడు పెళ్లి చేసుకునేదే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. దీంతో పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ క్రమంలోనే ఆ పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెళ్లి కొడుకుతో మాట్లాడి బైక్ కావాల్సిన డబ్బును పెళ్లి కూతురి తరపున తానే ఇస్తానని పెళ్లికొడుకుకు నచ్చజెప్పారు. ముందుగా రూ. 50 వేల నగదును వరుడి తండ్రికి అందజేశారు. మిగిలిన డబ్బులను బైక్ షోరూంకు అందజేస్తాని హామీ ఇచ్చారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన వరుడు వినయ్.. అనూష మెడలో తాళి కట్టారు. దీంతో పెళ్లి మండపంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఔదర్యం చూసిన అక్కడున్న పెళ్లింటివారి బంధువులు, స్థానికులు ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో రసమయి చేసిన పనికి అభినందనలు లభిస్తున్నాయి.












Click it and Unblock the Notifications