టీజీఎస్‌ఆర్టీసీగా మారిన టీఎస్‌ఆర్టీసీ: కొత్త లోగోపై సజ్జనార్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల టీఎస్(TS)ను టీజీ(TG)గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ పేరు కూడా టీజీఎస్‌ఆర్టీసీగా మారింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాల పేర్లనూ మార్చింది.
ఇకపై, ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను @tgsrtcmdoffice, @tgsrtchq (ఎక్స్)ఖాతాల ద్వారా అందించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో సూచించారు. మరోవైపు, ఆర్టీసీ లోగో మారినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. తన ఎక్స్ ఖాతాలో ఆర్టీసీ లోగోకు సంబంధించిన విషయంపై వివరణ ఇచ్చారు.

నూతన లోగో విషయంలో షోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు సజ్జనార్. అధికారికంగా ఇప్పటివరకు కొత్త చిహ్నాన్ని సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న లోగో ఫేక్ అని సజ్జనార్ పేర్కొన్నారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నూతన లోగోను సంస్థ రూపొందిస్తోందని, యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ స్పష్టతనిచ్చారు.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024
కాగా, తెలంగాణ ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని సర్కారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీఎస్‌కు బదులు టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications