మేడారం సమ్మక్క జాతరకు ముందు అడవిలో అద్భుతం!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఆయన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అడవి అంతా జనసంద్రంగా మారుతుంది. నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి కోట్లాదిగా భక్తులు తరలివస్తారు. అటువంటి మేడారం జాతర నాలుగు వారాల ముందే మేడారంలో ప్రారంభమవుతుంది.
మేడారం జాతరకు ప్రకృతి గ్రీన్ సిగ్నల్
అంతకుముందు ప్రకృతి కూడా మేడారం జాతరకు గ్రీన్ సిగ్నల్ పంపుతుంది. అడవిలో అద్భుతం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న ఏటూరునాగారం ప్రాంతం అటవీ సంపదకు ప్రసిద్ధి చెందింది. తెలంగాణలోని అత్యంత పురాతన అభయారణ్యాల్లో ఒకటి అయిన ఈ ప్రాంతం ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యంగా 1953లో ప్రకటించబడింది.

వన్య ప్రాణుల నిలయం ఏటూరునాగారం అభయారణ్యం
మొత్తం 812చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ అభయారణ్యంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఉంది. ఇక ఈ ప్రాంతంలోనే తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఒకప్పుడు పులులు సంచరించేవి. ప్రస్తుతం ఇక్కడ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, అడవి దున్నలు, సాంబర్, నీల్ గాయ్, పాములు, తేళ్లు, ఎన్నోరకాల పక్షులు ఉన్నాయి.
అమ్మల రాకకు అడవి సంసిద్ధం
ఈ అటవీ ప్రాంతంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి అద్భుతంగా జరుగుతుంది. జాతర ప్రారంభానికి ముందు అడవి కూడా అమ్మవారి రాకకు తన సంసిద్ధతను వ్యక్తం చేస్తుంది అని ఇక్కడ ఉన్న గిరిజన కోయలు చెబుతారు. జాతరకు ముందు గిరిజన సాంప్రదాయాల ప్రకారం అడవిని కూడా ఎలాంటి అపవిత్రత లేకుండా చూస్తారు. చెట్లు నరకడం గాని, ప్రకృతికి హాని చేయడం కానీ చేయరు.
అడవి శుద్ధితో మారే వాతావరణం
కొన్నిచోట్ల ఆచార బద్ధంగా అగ్ని కార్యక్రమాలు నిర్వహించి, అడవి శుద్ధి తో పాటు, దుష్ట శక్తులు రాకుండా చూస్తారు.ఇక అమ్మవారి రాకకు ముందు అడవిలో అద్భుతం జరుగుతుందని ఇక్కడ గిరిజనులు బలంగా నమ్ముతారు. ఆకాశం నిర్మలంగా మారుతుందని, అడవిలో గాలిలో మార్పు వస్తుందని, చల్లని గాలులు ఆహ్లాదకరంగా తాకుతాయని నమ్ముతారు.
భక్తులకు హాని చెయ్యని జంతువులు, పక్షులు
అంతేకాదు మేడారం అటవీ ప్రాంతం అంతా జనసంద్రంగా మారే వేళ వన్యప్రాణులన్నీ దట్టమైన అడవి లోపలికి వెళ్లిపోతాయని, అవి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి హాని చేయవని బలంగా విశ్వసిస్తారు. ఇక్కడ పాములు, తేళ్లు, కొండచిలువలు ఏవీ ప్రజలకు హాని చేయవని చెబుతారు. ఇప్పటివరకు ఇంతకాలంగా మేడారం జాతర జరుగుతున్నా ఇక్కడ ఉన్న జంతువులు, పాముల కారణంగా ఒక్కరు కూడా చనిపోయిన దాఖలాలు లేవన్నది అందరూ ఒప్పుకునే గొప్ప విషయం.
అడవి అందించే ఆతిధ్యం
అడవి నిశ్శబ్దంగా అమ్మల విషయంలో భక్తి తన్మయత్వంతో కనిపించడం, కోట్ల కొద్ది జనం తండోపతండాలుగా వచ్చినా ఎవరూ ఇబ్బంది పడకపోవడం ఈ జాతర యొక్క గొప్పతనం. ఇది జాతరకు వచ్చే భక్తులందరికీ అడవి అందించే ఆతిథ్యం.












Click it and Unblock the Notifications