విషాదం: మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ఆలం రామ్మూర్తి కన్నుమూత
వరంగల్: మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత ఆలం రామ్మూర్తి ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.
ఆదివారం ఉదయం కొద్దిపాటి అస్వస్థతకు గురికావడంతో రామ్మూర్తిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరోసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. పస్రా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.

రామ్మూర్తి మరణంతో ఆయన కుటుంబసబ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రామ్మూర్తి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రామ్మూర్తి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
కాగా, రామ్మూర్తి ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే మేడారం అభివృద్ధికి బాటలు వేశారు. మేడారం జాతర విజయవంతానికి, భక్తుల సౌకర్యాల ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. రామ్మూర్తి మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ మాలోత్ కవిత, టీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications