నీ సిరిసిల్లలోనే నిన్ను ఓడిస్తా: కోమటిరెడ్డి సవాల్
Komatireddy Venkata Reddy: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించిన వేళ.. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటోన్నారు. విమర్శలు- ప్రతి విమర్శలు నిత్యకృత్యం అయ్యాయి.
ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తామిద్దరం మల్కాజ్‌గిరి లోక్‌సభ బరిలో తేల్చుకుందాం రా అంటూ ఛాలెంజ్ చేశారాయన. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, కొడంగల్ శాసన సభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

తామిద్దరం మల్కాజ్‌గిరి లోక్‌సభ బరిలో పోటీ పడతామని, ఎవరు గెలుస్తారో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. మల్కాజ్‌గిరిలో తనతో పోటీ పడటానికి రావాలంటూ ఆహ్వానించారు కేటీఆర్. సేఫ్ గేమ్ ఆడొద్దంటూ హితవు పలికారు. రేవంత్ రెడ్డి గుర్తింపు కోసం వెంపర్లాడుతున్నాడని, ఐడెంటిటీ క్రైసిస్‌తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.
దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వరకు ఎందుకు కేటీఆర్‌ను మట్టికరిపించడానికి తాను చాలునని అన్నారు. తనతో పోటీ పడి నెగ్గాలని, ఆ తరువాతే రేవంత్‌కు సవాల్ చేయాలంటూ సూచించారు.
కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే తాను ఆయనతో పోటీకి సిద్ధమని ప్రకటించారు కోమటిరెడ్డి. సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని కేటీఆర్‌కు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో కేటీఆర్‌పై తాను పోటీ చేస్తానని, గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాననంటూ ధీమా వ్యక్తం చేశారు.
సిరిసిల్లలో గనక తాను ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్‌ను మూసేసుకుంటానంటూ కేసీఆర్ స్వయంగా ప్రకటించాలని అన్నారు. బీఆర్ఎస్.. సమీప భవిష్యత్తులో ఏ ఎన్నికలోనూ గెలవలేదని, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారాయన.












Click it and Unblock the Notifications