షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తుంది: బండి సంజయ్, రేవంత్ రెడ్డిపైనా పువ్వాడ ఫైర్!!
తెలంగాణలో వైయస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించటంతో ఆమెను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వైయస్ షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు.
కల్లూరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్చుకోలేకపోతున్నారని అందుకే సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా పెట్టుకొని తిడుతున్నారని మండిపడ్డారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంటే, వారికి కంటగింపుగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక కొందరు నాయకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నోటికొచ్చినట్టు కెసిఆర్ ను తిడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

షర్మిల పోలీసు కానిస్టేబుల్ ను కొట్టిందని కడప పొగరు ఇక్కడ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కడప రౌడీయిజం తెలంగాణలో చెల్లదని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో బిజెపిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన పువ్వాడ అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెబుతున్నాడని, బండి సంజయ్ సచివాలయాన్ని కూల్చేస్తామని అంటున్నాడని, మరొకడు ప్రగతిభవన్ కూల్చేస్తామని చెబుతున్నాడని నిప్పులు చెరిగారు.
ఎక్కడెక్కడి నుంచో వచ్చి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 159 మెడికల్ కళాశాలలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క కళాశాల కూడా మంజూరు చేయలేదని కానీ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తుందని మంత్రి పువ్వాడ చెప్పుకొచ్చారు.
ఇక ఇదే సమయంలో ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతమైన ప్రజలని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు తమ ఖాతాలోనే పడతాయన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.












Click it and Unblock the Notifications