అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్పూర్తిని చాటిన మంత్రి సీతక్క

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలంగాణ స్ఫూర్తిని ప్రతిధ్వనింపజేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన మహిళా నాయకత్వ సదస్సు 'వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్ (VVGF) గ్లోబల్ సమ్మిట్'లో ఆమె "From Adversity to Empowerment - The Power of Women to Transform Nations" అనే అంశంపై ప్రధాన ప్రసంగం చేశారు. "ప్రతికూలతల నుంచి సాధికారతవైపు - దేశాలను మారుస్తున్న మహిళల శక్తి" అనే అంశంపై సీతక్క ప్రసంగం అక్కడి శ్రోతలందరినీ ఆకట్టుకుంది. తన చిన్ననాటి ఆదివాసీ బాలిక జీవితం నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ప్రేరణాత్మక ప్రయాణాన్ని, ఆ మార్గంలో సమాజానికి అందించిన సేవలను, ప్రజాస్వామ్య పోరాటాలను, కరోనా కాలంలో చేసిన సహాయ కార్యక్రమాలను సీతక్క వివ‌రించారు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రపంచ వేదికపై ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి సీత‌క్క‌ మాట్లాడుతూ "నేను తెలంగాణలోని చిన్న ఆదివాసీ గిరిజ‌న గ్రామంలో పుట్టాను. పేదరికం, అసమానతలు నా బాల్యాన్ని మలిచాయి. 16 ఏళ్ల వయసులో న్యాయం కోసం అడవుల్లోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరాను. కానీ అసలైన మార్పు తుపాకీతో కాదు, విద్య, అనుభూతి, సాధికారతతో సాధ్యమవుతుందని తెలుసుకున్నాను " అని తెలిపారు. తాను జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన త‌ర్వాత తిరిగి విద్య‌ను ప్రారంభించి, ఎం.ఏ., ఎల్‌.ఎల్‌.బి., ఎల్‌.ఎల్‌.ఎం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసినట్లు చెప్పారు. "అడవుల నుంచి ప్రజాస్వామ్య సభల వరకు నా ప్రయాణం సాక్ష్యం. ప్రజల కోసం ప్రజాస్వామ్యంలోనే నిజమైన విప్లవం ఉంటుంది" అన్నారు.

Minister Seethakka Showcases Telangana Spirit on Global Stage

తెలంగాణలో మహిళల సాధికారతపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మంత్రి సీతక్క వివరించారు. "ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నాం. మహిళలు క్యాంటీన్లు నడుపుతున్నారు, సోలార్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇస్తున్నారు, పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్ర‌యాణిస్తున్నారు. ఉచిత ప్ర‌యాణికులు ఇప్పుడు ఆర్టీసి అద్దె బ‌స్సుల‌కు యాజ‌మానులుగా ఎదిగారు" అని ఇందిరా మహిళా శక్తి ద్వారా మ‌హిళ‌లు సాధించిన విజ‌యాల‌ను గ్లొబ‌ల్ వేదిక‌పై ఆవిష్క‌రించారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతం కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది 20 శాతం లోపే ఉందని తెలిపారు. స్థూల జాతి ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. "కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రతి సంవత్సరం క‌నీసం రూ.25 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నాం," అని సీతక్క తెలిపారు. 'వడ్డీ లేని రుణాలు' పథకం కింద ఏటా రూ. వేయి కోట్ల కు పైగా మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. 63 లక్షల మంది మహిళల సంఘటిత శక్తిగా "ఇందిరా మహిళా శక్తి" పనిచేస్తోందని, ప్రతి ఆడబిడ్డ ఆర్థికంగా స్వావలంబిగా మారడం తమ లక్ష్యమని చెప్పారు.

మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి మాట్లాడుతూ, "ఆరోగ్యలక్ష్మి, బాలమృతం, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లక్షలాది తల్లులు, పిల్లలకు పోషకాహారం అందిస్తున్నాం. అడవుల్లోని దూరప్రాంత గ్రామాల్లో కూడా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం," అని వివరించారు. పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల హక్కులను కాపాడడమే తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సీతక్క పేర్కొన్నారు. స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ ములుగు అడ‌వుల్లో కంటేయిన‌ర్ల‌లో పాఠ‌శాలు, వైద్య కేంద్రాల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యాన్ని ప్ర‌పంచ దేశాల ముందు ఆవిష్క‌రించారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారత లక్ష్యంగా మారిందని ఆమె పేర్కొన్నారు. "ఆఫ్రికాలో కోడింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి, లాటిన్ అమెరికాలో వ్యాపారం ప్రారంభించిన తల్లి, భారతదేశంలోని గిరిజన స్త్రీ... మన అందరికి ఒకే గమ్యం. మహిళ అభివృద్ధి చెందితే, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మహిళల సాధికారతే దేశ సాధికారత" అని ఆమె హితవు పలికారు. "నా ప్రయాణం అడవుల నుండి గ్లోబల్ వేదికల వరకూ సాగింది. సాధికారత ఎవరో ఇస్తే కాదు. మనమే సాధించేది, పంచేది. ప్రపంచానికి మహిళల శక్తి చూపించాల్సిన సమయం వచ్చింది" అంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. మంత్రి సీతక్క ప్రసంగం సదస్సులో పాల్గొన్న అనేకమంది మహిళలకు ప్రేరణగా నిలిచింది. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. చిత్తశుద్ధి, నిబద్ధత, పట్టుదలకి కృషిని జోడిస్తే - ఎక్క‌డో ఆదివాసీ గిరిజన ప్రాంతంలో పుట్టిన సీతక్కలాంటి సాధారణ మహిళలు కూడా ప్రపంచ వేదికలపై తమ‌ ముద్ర వేయగలరని చెప్ప‌డానికి ఆమె విజయగాథ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సులో పెరూ దేశ‌పు మొట్ట‌మొద‌టి మ‌హిళ ప్ర‌ధాని బెట్రిజ్ మెరినో, వివిధ దేశాల‌కు చెందిన మ‌హిళా ఎంపీలు, మ‌హిళా ప్ర‌ముఖులు పాల్గోని ప్ర‌సంగించారు. ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సాధించాల్సిన లక్ష్యాలపై తమ అనుభవాలను వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+