తెలుగు రాష్ట్రాల్లో వింత కల్లు, లొట్టలేసి తాగుతున్న జనం!- VIDEO
మనకు సాధారణంగా తాటి చెట్టు, ఈత చెట్టు లేదా ఖర్జూర చెట్ల నుంచి కల్లు రావడం తెలిసిందే. కానీ, ఏకంగా దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు నుంచి కల్లు కారడం ఎప్పుడైనా చూశారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం! మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ వింత ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది. ప్రకృతి చేసిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూడటానికి, ఆ మర్రి కల్లును రుచి చూడటానికి జనాలు తహతహలాడుతున్నారు.
తహశీల్దార్ ఆఫీస్ వద్ద ఊరిన వింత ఊట!
బయ్యారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న చిన్నాల కుంట చెరువు వద్ద ఒక భారీ మర్రి వృక్షం ఉంది. గత నాలుగైదు రోజుల క్రితం ఈ చెట్టు మొదట్లోని ప్రధాన వేరు భాగం నుంచి తెల్లటి ద్రవం కారడం ప్రారంభమైంది. మొదటి రోజుల్లో ఏదో రసం అనుకున్నప్పటికీ.. దాన్ని గమనించిన స్థానిక గౌడ కులస్థుడు శ్రీనివాస్ గౌడ్, తాటి చెట్టుకు గీసినట్లే ఆ వేరు భాగానికి కుండ కట్టాడు. ఆశ్చర్యకరంగా రోజుకు రెండు కుండల చొప్పున స్వచ్ఛమైన కల్లు అందులో పడుతుండటంతో ఆ ప్రాంతవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారాయి.

కొబ్బరినీళ్ల లాంటి రుచి.. ఆరోగ్యానికి మేలంటున్న జనం!
ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌లో లభించే కల్లులో రసాయనాలు కలుపుతున్నారనే భయాలు ఉన్నాయి. కానీ ఈ మర్రి కల్లు మాత్రం ఎలాంటి కల్తీ లేకుండా, అత్యంత శుచిగా, కొబ్బరిబొండాం నీళ్లలా తీపిగా ఉంటోందని తాగి చూసిన వారు చెబుతున్నారు. ప్రతి లీటర్ బాటిల్‌ను రూ. 20 నుంచి 30 రూపాయలకే శ్రీనివాస్ గౌడ్ విక్రయిస్తుండటంతో, దీనిని తాగేందుకు యువకులు, స్థానికులు పోటీపడుతున్నారు. మర్రి చెట్టు వృక్షశాస్త్రపరంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినదని, అందుకే ఈ కల్లు తాగుతుంటే శరీరానికి నవశక్తి వచ్చినట్లు అనిపిస్తోందని స్థానికులు సంబరపడుతున్నారు.
ఎగబడుతున్న ప్రజలు.. స్థానికంగా విపరీతమైన డిమాండ్!
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే నమ్మకంతో బయ్యారం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఈ మర్రి కల్లు కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ వింత కల్లుకు ఒక్కసారిగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పొద్దున్నే లేచి మర్రి చెట్టు వద్దకు చేరుకుని మరీ బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తున్నారు. ఒక వైపు సైంటిఫిక్‌గా మర్రి వేరు నుంచి ఇలాంటి ద్రవం రావడం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తి నెలకొనగా, మరోవైపు ఈ 'మర్రి కల్లు' వింతను చూసేందుకు వచ్చే సందర్శకులతో చిన్నాల కుంట చెరువు పరిసరాలు కోలాహలంగా మారాయి.














Click it and Unblock the Notifications