సుప్రీంలో ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ ఫైర్ !
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మియాపూర్ భూముల వివాదంలో చారిత్రక తీర్పునిస్తూ.. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వాదనలు వినిపించి, రాష్ట్ర ఆస్తులను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ, న్యాయశాఖ అధికారులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గత సర్కారు అక్రమాలపై సీఎ ధ్వజం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మియాపూర్ భూములను కొల్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్‌లు కుమ్మక్కై ఈ విలువైన భూములను కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ముడుపులుగా విలాసవంతమైన కార్లు, భారీగా నగదు బదిలీ అయ్యాయని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేల ఎకరాల విలువైన భూములను గత పాలకుల కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆయన దుయ్యబట్టారు.

కబ్జాలపై పోరాటమే నన్ను జైలుకు పంపింది
తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆపై పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ భూ అక్రమాలపై నిరంతరం గళం విప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు తాను చేసిన పోరాటాలను తట్టుకోలేకనే నాటి కేసీఆర్ ప్రభుత్వం కక్షపూరితంగా తనపై కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం కొనసాగించి, నేడు ప్రజా ఆస్తులను కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు.
మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పరిరక్షణ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే దాదాపు రూ.1.50 లక్షల కోట్ల విలువైన అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ నాయకులు కొట్టేయాలని చూసిన ఐఎంజీ భూములతో పాటు గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను న్యాయపోరాటం ద్వారా రక్షించామన్నారు. కేటీఆర్ అనుచరులు కబ్జాకు యత్నించిన గుర్రంగూడ భూమిపై సుప్రీంకోర్టులో పోరాడి అది అటవీ ప్రాంతమేనని తీర్పు పొందినట్లు తెలిపారు. మంచిరేవులలోని 143 ఎకరాల భూమిని రక్షించి, అక్కడ పోలీసుల పిల్లల చదువు కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు నజరానాకు ఇచ్చిన 400 ఎకరాల అటవీ భూమిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆక్రమణలను కూడా అడ్డుకున్నామని చెప్పారు.
సంక్షేమ రంగానికి నిధుల కేటాయింపు
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ప్రభుత్వానికి దక్కిన ఈ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ భూముల విక్రయం, వనరుల సమీకరణపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ ఉపసంఘాన్ని నియమించినట్లు చెప్పారు. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను రాష్ట్రంలో నీటిపారుదల, విద్య, వైద్యం వంటి ప్రాధాన్యతా రంగాలకు కేటాయిస్తామని, ముఖ్యంగా విద్యారంగ సమగ్ర అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అలాగా వివాదాస్పద ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించి శ్రీకాంతాచారి అమరవీరుల కాలనీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు ఛాలెంజ్
మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి వైఖరికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారని, ఆక్రమణదారులతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. హరీష్ రావు మామ హనుమంతరావు ఆక్రమించిన భూముల సర్వేను అధికారులతో అడ్డుకుని స్టే తెచ్చుకున్నారని మండిపడ్డారు. తమ భూ ఆక్రమణలపై శాసనసభలో చర్చకు రావాలని, ప్రజాసమక్షంలో నిజానిజాలు తేల్చుకుందామని ప్రతిపక్ష నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.














Click it and Unblock the Notifications
