బర్రెలక్క తమ్ముడిపై కత్తులతో దాడి: ఎమ్మెల్యే అభ్యర్థి కన్నీటిపర్యంతం (వీడియో)
హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.
తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు.

నిరుద్యోగులకు న్యాయం జరగాలని తాము పోరాడుతున్నామని.. యువత, నిరుద్యోగుల తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నానని ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బర్రెలక్క. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆమె కోరారు.
దాడి ఘటనపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామని బర్రెలక్క తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరుద్యోగ యువత కోసం పోరాడుతామని కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క తెలిపారు. కాగా, ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి కూడా ఆమెకు మంచి స్పందన వస్తోంది.
బర్రెలక్కకు పెరుగుతున్న మద్దతు
సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన బర్రెలక్క అలియస్ కర్నె శిరీష ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేసిన శిరీష ఉద్యోగం లేకపోవడంతో గేదెలు కాస్తుండడంతో అందరూ ఆమెను బర్రెలక్కగా పిలవడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న బర్రెలక్కకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.
నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి. కులమతాలకు అతీతంగా, డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో యువత పోటీచేసి గెలవాలన్న ఉద్దేశంతో బరిలో నిలిచిన బర్రెలక్కకు పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు ఇటీవల లక్ష రూపాయల విరాళం పంపించడం గమనార్హం.












Click it and Unblock the Notifications