కల్వకుంట్ల కవిత మంచి మనసు: హారిక ఎంబీబీఎస్‌కు అయ్యే ఖర్చు భరిస్తానని హామి
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని నీట్‌లో ర్యాంక్ సాధించిన విద్యార్థిని హారికకు అన్ని విధాలా అండగా ఉంటామని కవిత భరోసా ఇచ్చారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న చదువుల తల్లి హారికకు అయ్యే ఎంబీబీఎస్ ఖర్చులను తానే భరిస్తానని కవిత తెలిపారు.

యూట్యూబ్‌లో చూసి ఎంబీబీఎస్ ర్యాంక్ సాధించిన హారిక
నిజామాబాద్ జిల్లా నాందేవ్‌గూడకు చెందిన సతీష్ కుమార్, అనురాధల కుమార్తె ఈ నిహారిక. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో.. తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ హారికను చదవించింది. హారిక కూడా తల్లి పడుతున్న కష్టం తెలుసుకుని.. చదువులో ఎప్పుడూ ముందుండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లోనూ 942 మార్కులు సాధించింది హారిక.
ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనుకుంటున్న కృతనిశ్చయంతో ఇంట్లోనే యూట్యూబ్‌లో వీడియో క్లాసులు వింటూ నీట్‌కు సిద్ధమైంది హారిక. తన కష్టానికి గుర్తింపుగా నీట్‌లో జాతీయ స్థాయిలో 40వేల ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ లో ఓ మెడికల్ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
హారికను కలిసిన కవిత.. చెక్కు అందజేత
హారికకు సంబంధించిన వివరాలుతో వార్తా కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కవిత.. హారికకు అండగా నిలవాలనుకున్నారు. హారికను స్వయంగా కలిసిన కవిత.. ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామి ఇచ్చారు. మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజును చెక్కు రూపంలో హారిక కుటుంబసభ్యులకు స్వయంగా అందజేశారు కవిత.
హారిక వైద్యురాలు కావాలంటూ కవిత ఆకాంక్ష
చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించింది. తనకున్న పరిమిత వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం అభినందనీయం, సంతోషకరం. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలి. హారిక ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలి అని కవిత ఆకాంక్షించారు. కవిత అందించిన ఆర్థిక సాయానికి గానూ హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications