మహిళలకు అన్యాయం అంటూ తెలంగాణ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్: సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. సోమవారం హైదరాబాద్లో ఆమె మీడియా సమావేశాన్ని కవిత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్ణయంతో మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు.
మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రజల రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని కవిత(Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల స్పూర్తిని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీఓ తీసుకురావడాన్ని ఆమె తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు కవిత.

ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయంతో నష్టం జరిగే అవకాశం ఉందని కవిత అన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్లతో పాటు రోస్టర్ పాయింట్ ను ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల మహిళలకు 33 శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు. మహిళలకు అవకాశాలు తగ్గుతాయని, రోస్టర్ లేకపోవడంతో మహిళల ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని శాఖల్లోని ఉద్యోగ నియామకాలపై ఈ ప్రభావం స్పష్టంగా పడుతుందని కవిత తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలు, యువత ఈ అంశాలను గమనించాలన్నారు. కొత్త జీఓ విడుదల అంశంలో ఎవరితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలకు లేఖ రాసినట్లు కవిత తెలిపారు. ఇందులో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించానని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సోనియాను కోరినట్లు కవిత వెల్లడించారు. పాత విధానంలోనే మహిళా రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టులో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల్లో 66 వేలు ఆడబిడ్డలకు కచ్చితంగా వస్తాయా? లేదా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications