మంత్రి పదవి ఆయనే అడ్డుకున్నారు, నేనంటే భయం - రాజగోపాల్ సంచలనం..!!
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. రేవంత్ మంత్రివర్గ విస్తరణ పైన కొంత కాలంగా చర్చ సాగుతోంది. 17 నెలల పాలన పూర్తి కావటంతో ఇక విస్తరణకు ఏఐసీసీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అనూహ్యంగా విస్తరణకు బ్రేక్ పడింది. దీని వెనుక ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మంత్రి పదవుల విషయంలో రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మంత్రి పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు కారణం ఏంటో బయట పెట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ లొల్లి మొదలైంది. ఈ నెల తొలి వారంలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని అందరూ భావించారు. ముహూర్తం పైన ప్రచారం సాగింది. చివరి నిమిషంలో విస్తరణ వాయిదా పడింది. మంత్రి పదవి పైన పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు తెలంగాణ పైన కమిట్ మెంట్ ఉందని చెప్పారు. తన లాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే పది మందికి మంచి జరుగుతుందని చెప్పారు. తాను మంత్రి అయితే వాళ్ల మాట వినడనే భయం కొందరికి ఉందన్నారు. తనను చూసి అందరూ భయపడుతన్నారని వ్యాఖ్యానించారు. తాను అడుక్కొని మంత్రి పదవి తెచ్చుకునే పరిస్థితుల్లో లేనని కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి స్పష్టం చేసారు.

సీనియర్ నేత జానారెడ్డి ధర్మరాజుగా ఉండాల్సిన ధృతరాష్ట్రుడు గా మారారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు మంత్రి పదవి వస్తుందనే చెమటలు పట్టాల్సిన అవసరం ఏంటని రాజ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తానని చెబుతుంటే.. కొందరు నేతలు అడ్డు పడుతున్నారని చెప్పుకొచ్చారు. జానరెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుం టున్నారని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో జానారెడ్డి పార్టీ హైకమాండ్ కు లేఖ రాసారు. రంగారెడ్డి, హైదరాబాద్ కు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కాగా, మంత్రి వర్గ విస్తరణ చర్చల వేళ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి పైన రాహుల్ ప్రశ్నించినట్లు పార్టీ నేతలు అప్పట్లో వెల్లడించారు. అన్న వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండగా.. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఎలా ఇస్తారని ప్రశ్నించినట్లు చెప్పారు.
అయితే, కాంగ్రెస్ లో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో సంచలనంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications