తెలంగాణపై మోడీ కీలక వ్యాఖ్యలు: ప్రధానివా..గుజరాత్ ముఖ్యమంత్రివా: రేవంత్ రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్స్‌ను తప్పు పట్టింది. మోడీ చేసిన వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శనలను నిర్వహించే దిశగా నిర్ణయాలను తీసుకుంటోంది. పార్లమెంట్ సమావేశాల్లోనూ దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయాలని భావిస్తోంది.
Recommended Video

కాంగ్రెస్‌పై విమర్శలు..
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలను తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటు విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ది విభజించు.. పాలించు అనే విధానమని, ఇది వారి డీఎన్‌ఏలోనే ఉందని మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోందని మండిపడ్డారు. అంబానీ, అదానీలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని, ఇది వామపక్ష వైఖరిని ప్రస్ఫూటింపజేస్తోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ను తిరస్కరించిన తెలంగాణ..
ఈ సందర్భంగా మోడీ తెలంగాణ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణను ఇచ్చినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలే దీనికి కారణమని చెప్పారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతున్నారని, అయినా ఆ పార్టీ నేతల ఈగో మాత్రం తగ్గట్లేదని ప్రదాని మోడీ ఎద్దేవా చేశారు. ఇంకో వంద సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలో రాలేదని తేల్చి చెప్పారు.

తప్పు పట్టిన రేవంత్ రెడ్డి..
ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఘాటుగా విమర్శించారు. తెలంగాణ పట్ల మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిననే విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. తాను ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రిననే అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక దేశాన్ని పరిపాలిస్తోన్న ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఎందుకిచ్చామంటే..
సభ వాయిదా పడ్డ తరువాత ఆయన పార్లమెంట్ ఆవరణలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి..కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప- ఓట్ల కోసమో.. రాజకీయ ప్రయోజనాల కోసమో.. ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోట్లాదిమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్సేనని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

ఐపీసీ సెక్షన్ 302లా..
దేశానికి ఐపీసీ సెక్షన్ 302లా బీజేపీ తయారైందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్‌లో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఓటర్లు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లల్లో బీజేపీ పోటీ చేస్తే 107 చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదనే విషయాన్ని మర్చిపోయినట్టున్నారని చెప్పారు. ఆ ఎన్నికల్లో తాము 30 శాతం ఓట్లను సాధించామని గుర్తు చేశారు. బీజేపీకి ఎంత శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయో తెలుసా? అని నిలదీశారు. పార్లమెంట్ వంటి అత్యున్నత చట్టసభలో ఇలాంటి విషయాలను ప్రస్తావించడం ప్రధానమంత్రి హోదాకు తగదని రేవంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications