బండి సంజయ్ కు కీలక పదవి - సత్యకుమార్ కు ముఖ్య బాధ్యతలు..!!
ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ముందు పార్టీ పరంగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీకి చెందిన నేత సత్యకుమార్ కు పార్టీలో ముఖ్య బాధ్యతలు కేటాయించింది. పార్టీ చీఫ్ నడ్డా తాజా నియామకాలపైన ఉత్తర్వులు జారీ చేసారు.
బీజేపీ తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కు ప్రమోషన్ లభించింది. ఆయనకు అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఇక ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌కు సైతం మరోసారి జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. కిషన్ రెడ్డి స్థానంలో బండికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కుతుందని భావించారు.

కానీ తాజాగా బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించటం పైన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బండి ద్వారా పార్టీకి జోష్ వచ్చిందని, ఎన్నికల సమయంలో తప్పించటం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ సుముఖంగా లేరని సమాచారం. సాధారణ కార్యకర్తగానే ఉంటానని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే పార్ట బండికి ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. పార్టీలో యాక్టివ్ గా ఉన్న డీకే అరుణకు జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత కల్పించారు.
ఏపీలో అధ్యక్ష రేసులో చివరి వరకు ఉన్న సత్యకుమార్ కు ఇప్పుడు మరోసారి జాతీయ కార్యదర్శిగా అవకాశం కల్పించింది. ఏపీలో బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించటంతో సత్యకుమార్ ను జాతీయ కార్యదర్శి పదవిలో కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో ఎన్నికల సమయంలో మార్పులు చేస్తున్న నాయకత్వం..అదే సమయంలో పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది గతంలో కాంగ్రెస్ లో పని చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇద్దరు ఈ రోజున బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications