లోకేశ్‌కు అవగాహన లేదు: కవిత, కేసీఆర్, కేటీఆర్‌లు గెస్టులు: నారా లోకేశ్
హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ చేసేందేమీ లేదని అన్నారు.
లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 'కారు'లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు 'సైకిల్' వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు.
మతాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు అడిగే రాజకీయ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు. హైటెక్ సిటీ మాత్రమే కాదు, హైదరాబాద్‌లో నివసిస్తున్నవారందరూ తమవాళ్లేనని ఆమె అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీని తెలంగాణకు ఎన్నిసార్లు పిలిచినా రాలేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి కలిగిన నేతగా ఆమె అభివర్ణించారు. అందరినీ సమదృష్టితో చూస్తున్నారని, ఎటువంటి వివక్ష చూపించడం లేదని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవకాశవాదులను ఓటర్లు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50శాతం డివిజన్లు మహిళలకు కేటాయించడం కేసీఆర్ గొప్పతనమన్నారు. మహిళలు పదవుల్లో ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని...అందువల్ల హైదరాబాద్ మేయర్‌గా మహిళ కావాలని తాను కోరుకుంటున్నట్లు కవిత పేర్కొన్నారు. 'మన నగరం మన పార్టీ' తమ నినాదం అన్నారు. టీఆర్‌ఎస్ ఎప్పటికీ ప్రజల పార్టీయేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్‌లు గెస్టులు: నారా లోకేశ్
హైదరాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్‌లు గెస్టులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. బుధవారం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. . హైదరాబాద్ కు తాను గెస్టును కాదని, తాను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనేనని చెప్పారు.
కానీ కేటీఆర్ గుంటూరులో చదివారని, తాను హైదరాబాద్ లోనే చదివానని తెలిపారు. నగరానికి కేసీఆర్, కేటీఆర్ లే గెస్టులన్నారు. ఇక హైదరాబాద్ నగరానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో కేటీఆర్ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని గెలిపిస్తే 2017 జనవరి 16లోగా హైదరాబాద్‌లో మెట్రోను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications